Punjab National Bank: పండగ సీజన్‌లో కస్టమర్లకు బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను సైతం తగ్గిస్తోంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజులను తగ్గిస్తున్నాయి బ్యాంకులు. పండగ సీజన్‌లో వినియోగదారులకు మరింత ఆనందాన్ని అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందిస్తోంది. బంగారు అభరణాలపై 7.30 శాతం వడ్డీ రేటు, సావరిన్ గోల్డ్ బాండ్‌పై 7.2 శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తోంది.
అంతేకాకుండా బంగారు రుణాలపైనే కాకుండా గృహ రుణాలపై కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది. వీటిపై 6.60 శాతం నుంచి వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కారు లోన్‌పై 7.15 శాతం, వ్యక్తిగత రుణాలపై 8.95 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఇటీవల గృహ రుణాలు, వాహనాల రుణాలపై ప్రకటించిన విధంగానే పండగ సీజన్‌లో బంగారు, పావరిన్ గోల్డ్ బాండ్‌పై సర్వీస్ ఛార్జీలను సైతం తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ కల్పిస్తోంది. అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ, యాక్సిస్, చిన్న ఫైనాన్స్ కంపెనీలు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. హోమ్ లోన్స్, పర్సనల్, ఇతర లోన్స్‌పై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను కూడా తగ్గించాయి. వినియోగదారులు పండగ సీజన్‌లో కారు కొనుగోలు చేయాలన్నా, గృహ రుణాలు తీసుకోవాలన్నా ఇది మంచి అవకాశమనే చెప్పాలి.