దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫేల్ వివాదం… ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పారిస్‌లో తాజాగా జరిగిన ఘటన భారత వైమానిక దళాన్ని షాక్‌కి గురిచేసింది. పారిస్ శివారులో రాఫేల్ విమానాల తయారీని పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడానికి యత్నించారు. ఈ ఘటన ఈ నెల 19న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాఫేల్ విమాన తయారీ సంస్థ డసాల్ట్ కంపెనీ.. ఓ జాతీయ ఛానెల్‌కు వెల్లడించింది. రాఫేల్ విమానాలకు సంబంధించిన డేటాను దొంగిలించడానికే దుండగులు యత్నించారా.. లేక ఇది గూఢచర్యమా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆ సంస్థ పేర్కొంది. ఏమైనా ఇ ఉదంతం భారత వైమానిక దళాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఐఏఎఫ్‌కు చెందిన క్యాప్టన్ ర్యాంక్ అధికారే పారిస్‌లో బృందానికి అధిపతిగా ఉన్నారు. రక్షణశాఖ, భారత వైమానిక దళం, ఫ్రెంచ్ ఎంబసీ దీనిపై ఇంత వరకు స్పందించలేదు. రాఫేల్ యుద్ధ విమానం అణు సామర్థ్యం కలిగినది. అయితే ఎవరైనా సాంకేతిక సమాచారం చోరీ చేస్తే, అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, రాఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం ఇండియాలో రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం మెట్లెక్కగా.. కోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.