Assam Election 2021: అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి. అసలు ఓటర్లకు.. పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు. మరో వైపు విచ్చలవిడిగా డబ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హసావో జిల్లాలోని హాఫ్లాంగ్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్ల కంటే ఎక్కు వ ఓట్లు పోలవడంతో రచ్చ రచ్చగా మారింది. దీనికి బాధ్యలైన ముగ్గురు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండో విడత ఎన్నికల్లో భాగంగా హాప్లాంగ్‌లో ఏప్రిల్ 1న పోలింగ్ జరిగింది. స్థానిక ఖోట్లిర్ ఎల్‌పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా.. ఈవీఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఏప్రిల్ 2వ తేదీనే జారీ అయిన్పటికీ ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఘటన నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే సస్పెండ్ అధికారులు చెబుతున్న విషయాలు విస్తు గొలుపుతున్నాయి. ఈసీ ఓటర్ల జాబితాను అంగీకరించని స్థానిక గ్రామపెద్ద తమ సొంత జాబితాను తీసుకొచ్చారని, దాని ప్రకారమే అక్కడ ఓటింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే జాబితా కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలిపారు. ఇదిలా ఉంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వచ్చిన ఓటరు జాబితా లెక్కలతో పోలింగ్ జరపాల్సింది పోయి అతనెవరో తెచ్చిన వాటి లెక్కప్రకారం పోలింగ్ జరపడమేంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది.
ఇటీవల కరీమ్‌గంజ్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంను ప్రైవేటు వాహనంలో తరలిస్తుండటం, అది భాజపా అభ్యర్థికి చెందిన కారు కావడం తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.