లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది.
ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని జాతీయ హిందీ పత్రిక పేర్కొంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవిలోనూ గహ్లోత్ కొనసాగనున్నారని సమాచారం. పార్టీ సీనియర్లు, రాహుల్ కుటుంబ సభ్యులు సైతం అశోక్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.