Nimmagadda Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ మా బాధ్యత అని తెలిపిన నిమ్మగడ్డ.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మేము ఎన్నికలకు సిద్ధంగా లేమని, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు అసలు జరుగుతాయా.? ఉద్యోగులు సహకరించకపోతే పరిస్థితి ఎంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే.. నిమ్మగడ్డ ఒక వైపు … ప్రభుత్వ అధికారులంతా మరోవైపు అన్నట్లుగా వ్యవహారం సాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకూ జిల్లా కలెక్టర్ నుంచి అధికారి వరకూ ఎవరూ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదు. అన్ని జిల్లాల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు బోసిపోయాయి. రాష్ట్ర స్థాయి అధికారి కూడా అటు వైపు కన్నత్తి చూడలేదు. కొందరు జిల్లా అధికారులు అయితే.. ఇదే టైమ్‌లో ఇతరత్రా సమావేశాలకు హాజరయ్యారు. కానీ ఎన్నికల సంఘం సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. సమావేశానికి రాకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామన్న నిమ్మగడ్డ వార్నింగ్‌ను ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ఎన్నిక సంఘంపై పడింది. హాజరుకాని అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారన్నదీ ఆసక్తిగా మారింది.
వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారుల గైర్హాజరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌తో రేపు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి అధికారులు వెళ్లకపోవడం దురదృష్టమని బీజేపీ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేయడమని ఆయన చెప్పారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పరిధి మీరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఏదిఏమైనా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాంలో ఎన్నికలు నిర్వహించరాదని సర్కారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 9 నెలలుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ‘పంచాయితీ’ నడుస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాలు, సూచనలేవీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున… ఎలాంటి వివాదాల్లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది.
ఇందుకోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రస్థాయి అధికారులతో సహా ఏ ఒక్కరు హాజరు కాలేదు. సమావేశానికి రానివారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికల అధికారులు ఒంటరిగా కూర్చున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎస్ఈసీ వర్సెస్ ఏపీ సర్కార్ వార్ సోమవారం వరకు కొనసాగే అవకాశం కనపడుతోంది.
వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారుల గైర్హాజరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌తో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే.. నిమ్మగడ్డ ఒక వైపు … ప్రభుత్వ అధికారులంతా మరోవైపు అన్నట్లుగా వ్యవహారం సాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకూ జిల్లా కలెక్టర్ నుంచి అధికారి వరకూ ఎవరూ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదు. అన్ని జిల్లాల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు బోసిపోయాయి. రాష్ట్ర స్థాయి అధికారి కూడా అటు వైపు కన్నత్తి చూడలేదు. కొందరు జిల్లా అధికారులు అయితే.. ఇదే టైమ్‌లో ఇతరత్రా సమావేశాలకు హాజరయ్యారు. కానీ ఎన్నికల సంఘం సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. సమావేశానికి రాకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామన్న నిమ్మగడ్డ వార్నింగ్‌ను ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ఎన్నిక సంఘంపై పడింది. హాజరుకాని అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారన్నదీ ఆసక్తిగా మారింది.
ఐదు గంటల డెడ్‌లైన్. రెండు గంటల నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేసిన ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కాకపోతే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ హెచ్చరికలు పంపారు. కానీ ఎస్ఈసీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎవరూ వీడియోకాన్ఫరెన్స్‌కు హాజరుకాలేదు. కనీసం ఒక్కరైనా వస్తారేమో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిమ్మగడ్డ చూసిన ఎదురు చూపులు ఫలించలేదు. ఒక్క అధికారి కూడా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడంతో, పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి అడుగే అడ్డం పడినట్లయ్యింది.
రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారం అనే వస్త్రాలను విడిచేసి చంద్రబాబు చెలరేగిపోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కళ్లు, చెవులు మూసుకుని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయంతో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రచారానికి వెళ్లలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో చెప్పిస్తున్నారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదా? అని ప్రశ్నించారు.
GHMC ఎలక్షన్లలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయానికి తండ్రీ కొడుకులిద్దరూ ప్రచారానికి వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని నిమ్మగడ్డతో చెప్పిస్తున్నారే. ప్రజల ప్రాణాలకు విలువే లేదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2021
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని దేశ ప్రధాని ఒకవైపు చెబుతుంటే.. ప్రజారోగ్యం ఏమాత్రం పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. నిమ్మగడ్డ.. ఓ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన బొత్స.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ శుభపరిణామమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సీఎం, ఉద్యోగులు ఎన్నికలకు సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సుప్రీం జోక్యం చేసుకోదని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి ఆశాభంగం తప్పదన్న హర్షకుమార్. ఎస్ఈసీ పదవీ కాలాన్ని మరో 3నెలల పాటు పొడిగించాలని, రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ రాస్తానని హర్షకుమార్ తెలిపారు.
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్ట్ తీర్పు జగన్ సర్కార్‌కు చెంపలాంటిదని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు. శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న ఆయన రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా పదే పదే కోర్టులను ఆశ్రయించడమే అందుకు ఉదాహరణ అన్నారు. ఓటమి భయంతోనే ఎలక్షన్స్‌తో వాయిదా కోరుతోందని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఎలక్షన్ కమిషన్‌కు కులాన్ని ఆపాదించడం తగదన్నారు టీడీపీ ఎంపీ.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రెస్ మీట్ కేవలం పొలిటికల్ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉద్యోగులు పట్టించుకోకపోతే.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తదని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా అయితే, ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ప్రతిష్టంభన తప్పదా? ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలు ముద్రణ, సర్పంచ్ బ్యాలెట్ పత్రాల ముద్రణతో పాటు బ్యాలెట్ బాక్సులు రెడీ చేయాలి. నాలుగు విడతల ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు సాధ్యమా? అనే పరిస్థితులు ఏర్పడ్డాయి.
సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి, షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే రిటర్నింగ్ అధికారుల నియమాకం జరగాలి. నామినేషన్ల పత్రాలు ముద్రించాలి. గడువు ముగిసిన తర్వాత స్కూటినీ చేయాలి. పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించాలి. ఆతర్వాత వారికి గుర్తులను కేటాయించాలి. ఇదంతా ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ. ఈ మొదటి తంతు పూర్తి కావాలంటే అధికారుల పాత్ర కీలకం. ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులు కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటర్నింగ్ ప్రక్రియ సాధ్యమవుతుందా?
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సోమవారం ఉదయం పది గంటల కల్లా జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాతే రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాతే వస్తుంది. అంటే… ఈలోపే కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఆ అవకాశం ఉందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల లిస్టుల విడుదల కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు రాకపోవడం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ గవర్నర్ దగ్గరకు వెళతారా? లేదంటే తనకు ఉన్న అధికారంతో ఇంకేమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పటి వరకు అధికారులు వస్తే సరి. సహకరించకపోతే సీరియస్ యాక్షన్ తప్పదని ఈ ఉదయమే వార్నింగ్ ఇచ్చారు నిమ్మగడ్డ. మరి అధికారులు ఐదు గంటల వరకు సైలెన్స్‌ను మెయింటేన్ చేస్తారా? ఎస్ఈసీ సమావేశానికి హాజరవుతారా..? ఎన్నికలపై వివరాలు ఇస్తారా? అన్నది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీసులో నిన్నటి సీనే రిపీట్ అవుతోంది. అధికారులు రావాలని చెప్పినా… ఎవరూ రియాక్ట్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్ ఎవరూ SEC ఆఫీసుకు రాలేదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం… వీడియో కాన్ఫరెన్స్‌ను 3 గంటలకే మొదలు పెట్టారు. అధికారుల కోసం వేచి చూస్తున్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికల కమిషన్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకు వ్యాక్సినేషన్ జరుగుతుండగా నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. నిమ్మగడ్డతో కొందరు వ్యక్తులు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఇతర ఎన్నికల అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కావల్సిన అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేసి ఎదురుచూస్తున్న ఈసీ అధికారులు. అయితే సాయంత్రం 5గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. కాగా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోంది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి అధికారుల ఎవరు హాజరుకాలేదు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా
మరికాసేపట్లో అధికారులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ కోసం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. అయితే, సమావేశానికి అధికారులు హాజరవుతారా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్‌ఈసీని కోరారు. ఏపీ సీఎస్ అభ్యర్థనను తిరస్కరించిన ఎస్‌ఈసీ ఈ మేరకు లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని.. వ్యాక్సినేషన్, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక అని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. అందరి సహకారంతోనే స్థానిక ఎన్నికలను పూర్తి చేయగలుగుతామన్నారు.
నోటిఫికేషన్ విడుదలపై తీవ్రంగా మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. మీరు అద్దాల మధ్యలో కూర్చుని మాట్లాడతారు… మేం మాత్రం ఎన్నికల్లో ప్రాణాలు పోగొట్టుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. మీ పంతాలు, పట్టింపులకు మా ప్రాణాలు తీయొద్దని వేడుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాజ్యాంగం ఇప్పుడే గుర్తొచ్చిందా… 2018 నుంచి ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజన్లలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో కలిపి 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలో 146 మండలాల్లో, రెండో విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169మండలాల్లో, నాలుగో విడతలో భాగంగా 19 రెవెన్యూ డివిజన్లలోని 171మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.పరిపాలనాపరమైన, న్యాయపరమైన వివాదాల కారణంగా 17 మండలాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. అదే విధంగా విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వైసీపీదేనని… తాము సిద్ధంగా ఉన్నామన్నారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధారెడ్డి. భయపడి ఎలక్షన్‌లు వద్దని చెప్పడం లేదన్నారు. ఎవర్ని సంప్రదించి అప్పట్లో వాయిదా వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబును ఓడించి 151 సీట్లు గెలిచామని… ఇప్పుడు గెలవడం తమకు కష్టమేమీ కాదన్నారు బైరెడ్డి.
ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలంటే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు లెక్కలేకుండా పోయిందన్నారు వైసీపీ నేత, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. తాము చేయలేమని ఉద్యోగులు చేతులెత్తేసినా కూడా ఆయన ముందుకెళ్లడం దారుణమన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కేసులు పెరిగిన విషయాన్ని నిమ్మగడ్డ గుర్తించాలని హితవు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు హాజరయ్యే టైంలో ఉద్యోగులకు కరోనా గుర్తు రాలేదా అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కొన్ని ఉద్యోగ సంఘాలు సెల్ఫ్ మోటీవ్‌తో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ఎన్నికల వ్యవ్థలో శేషన్ ఎలా తనదైన ముద్రవేసుకున్నారో.. రాష్ట్ర ఎన్నికల హిస్టరీలో నిమ్మగడ్డ నిలిచిపోతారని అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఒత్తడి తీసుకొచ్చినా వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడ్డారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను ధిక్కరించడం కోర్టు ధిక్కరణనే అవుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ఏపీ సీఎం జగన్ భయమన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజలు మేల్కొనాలని సూచించారు.
ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామి రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం మండిపడింది. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా హక్కు ఉందని.. రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచారంటూ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పేర్కొంది.
లోకల్ బాడీ ఎన్నికలకు కరోనాను సాకుగా చూపడం సరికాదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి తొలి మెట్టు అయిన పంచాయితీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన పవన్.. ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఎన్నికల్లో పాల్లొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులును అర్దం చేసుకుని ఎన్నికలు జరపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరికాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వద్దు అని వాదిస్తోన్న నేపథ్యంలో అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరికొద్ది సేపట్లో దీనిపై ఓ స్పష్టత రానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ రమేష్ ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని అంబటి ఈ సందర్భంగా తెలిపారు. కానీ నిమ్మగడ్డ మాత్రం తాను పదవి దిగిపోయేలోపే ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు. నిమ్మగడ్డ ప్రసంగం రాజకీయ పార్టీ నేతల ప్రసంగంలా ఉందని అంబటి విమర్శించారు. ఆంధ్ర ప్రజల మీద కక్ష్యతోనే ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి ఆరోపించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీపై టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని తెలిపారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలను రద్దు చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
ఎట్టి పరిస్థితుత్లో ఆంధప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహించి తీరుతామని చెబుతోన్న నిమ్మగడ్డ రమేష్. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియకు అవరోధాలు ఏర్పడితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు ఎదురైతే గవర్నర్, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి సజావుగా జరిగేలా చూస్తామని తెలిపారు. ఇక ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ల నుంచి పూర్తి సహకారం ఉందని, ప్రభుత్వం కూడా సహకరిస్తుందని నిమ్మగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహిస్తుందని నిమ్మగడ్డ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఎందుకు పంతానికి పోతున్నారని ఏపీ రెవెన్యు ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈసీకీ లేదా అని ప్రశ్నించారు. పంతానికి పోయి ఎన్నికలు నిర్వహిస్తే కరోనా కేసులు పెరిగినా.. మరణాలు సంభవించినా దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయమై మరోసారి గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. అలాగే నిమ్మగడ్డ వద్దకు వెళ్లి లెటర్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ మాత్రం వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘాల నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జరిగేలా లేవని అభిప్రాయపడ్డారు నిమ్మగడ్డ చెప్పినట్లే మూడున్నర లక్షల మంది ఓటు హక్కును కోల్పోయిన నేపథ్యంలో.. వారిలో ఏ కొందరు కోర్టుకు వెళ్లినా.. ఎన్నికలు వాయిదా పడతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఓటు హక్కును తీసివేసే హక్కు ఎన్నికల కమిషనర్‌కు ఎవరిచ్చారంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించితీరుతామని చెప్పిన నిమ్మగడ్డ.. ప్రభుత్వంపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విషయంలో ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవని, ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నా కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పుకొచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరుతామని చెప్పిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మాకు మద్ధతుగా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేరు. జాయింట్ డైరెక్టర్, న్యాయ సలహాదారులు లేరు ఉన్నది కొంతమందే ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహించడం కమిషన్‌కు కచ్చితంగా సవాల్ అని చెప్పారు. ఇన్ని అవరోధాలు వచ్చినప్పటికీ ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం అని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పన నేపథ్యంలో. మొదటి విడత ఎన్నికల షెడ్యుల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం..
జనవరి 23 నోటిఫికేషన్ జారీ
జనవరి 25 అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ప్రారంభం.
జనవరి 27 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 28 నామినేషన్ల పరిశీలన
జనవరి 29 అభ్యంతరాల పరిశీలన
జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
జనవరి 31 మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5 పోలింగ్ తేదీ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30), ఇదే రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక.
పంచాయితీ రాజ్ శాఖ అలసత్వం, బాధ్యతారాహిత్యం కారణంగా మూడునున్నర లక్షలకు పైగా యువకులు ఓటు హక్కును కోల్పోయారని నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. దీనిని కమిషన్ చాలా తీవ్ర విషయంగా పరిగణిస్తుందని, దీనిమీద తప్పనిసరిగా అందరీపై సరైన సమయంలో, సరైన చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
ఎన్నికలు నిర్వహించేముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్న దానిపై స్పష్టత ఉండాలి కానీ ఈ విషయంలో పంచాయతీ రాజ్ కమిషనర్, సెక్రటరీ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని నిమ్మగడ్డ అన్నారు. చర్చలు జరగని నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో కమిషన్ 2019 ఎన్నికల రోల్ ప్రాతిపదికనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల 18 ఏళ్లు నిండిన సుమారు 3.6 లక్షల మంది యువకులు ఓటు హక్కు కోల్పోతున్నారని నిమ్మగడ్డ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు జరగబోయే ఎన్నికలను తొలి విడతలో భాగంగా ప్రకాశం, విజయనగరం జిల్లాలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు, ఎన్నికల ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.
ఏపీలో జరగోయే ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. హైకోర్టు ఇచ్చిన అనుమతితోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని తేల్చిచెప్పారు.
ఆంధప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరగుతోన్న చర్చపై స్పందించడానికి మీడియా ముందుకు వచ్చిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి అని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, ఇప్పుడు.. ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నాయని చెప్పారు.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్ననేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ మరికాసేపట్లో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనుండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మరికాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను 4 దశల్లో నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.