ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని విజయనగరం జిల్లా పార్వతీపురం వెళ్లి ఏపీ మంత్రులు పరామర్శించారు. వంగపండు లేని లోటు తీర్చలేనిదని డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణిలతో పాటు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వంగపండు నివాసానికి వెళ్లారు. మంత్రులంతా స్వర్గీయ వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగపండు ప్రసాదరావు భార్య విజయలక్ష్మి, కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్‌లకు సీఎం తరపున మంత్రులు సంతాపం తెలిపారు.
వంగపండు మృతి ఉత్తరాంధ్రలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటు అన్నారు. ఆయన పాట ఎప్పటికీ నిలచే ఉంటుందని ధర్మాన చెప్పారు. వంగపండు కుటుంబానికి గవర్నమెంట్ అండగా ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు.. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. వంగపండు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట, ఆట … ఈ భూమి ఉన్నంతవరకు చిరస్థాయిగా ఉంటాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. గిరిజనుల సమస్యలను తన గొంతుతో ప్రపంచానికి తెలిపి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేసిన వ్యక్తి వంగ పండని మంత్రి కొడాలి నాని కొనియాడారు.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు