ఏపీ ఆర్టీఎస్ కార్మికుల కోరిక నెరవేరబోతోంది. వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందకు ఆ సంస్థ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో.. పాలకమండలి 27 అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా విలీన ప్రక్రియను ఆమోదిస్తూ.. పాలకమండలి.. కీలక తీర్మానం చేసింది. కాగా.. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఆమోదించింది.
అంతేకాకుండా.. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు మరిన్న అంశాలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న 27 అంశాలపై చర్చించి.. పలు నిర్ణయాలు తీసుకుని ఆమోదముద్ర వేశారు. అలాగే.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా.. విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలం లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేశారు. ఆర్టీసీని కంప్యూటరీకరణ చేస్తున్నందున జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని రద్దు చేశారు. ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు అనుమతిస్తూ.. ఆర్టీసీ పాలకమండలి తీర్మానించింది.