అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్–2019 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. తర్వాత విద్యార్థులు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు సరిచేసుకోవడానికి వీలుగా 9న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తారు. 11న సీట్లను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులో పేర్కొన్న వివరాలతో దాదాపు లక్ష మంది వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వెబ్ సర్వీసింగ్ ద్వారా పూర్తయింది. ఇప్పటికే ఆయా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఈ సమాచారం అందించారు.