రాష్ట్రంలో కొత్తగా రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు రాష్ట్రంలో విద్యా బోధన సాగాలని అన్నారు. సోమవారం అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా విధానం–2020పై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? కేంద్ర సూచించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం జగన్.
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్ పొందాలన్నారు సీఎం. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు సీఎం జగన్. అలాగే, విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పాలంటే ముందుగా టీచర్ ట్రెయినింగ్ కాలేజీలపై దృష్టి పెట్టాలన్న సీఎం.. ప్రమాణాలు పాటించని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని.. అయినా వారిలో మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయాలని సూచించారు సీఎం జగన్. బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. కాలేజీలలో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ ఖరారు చేసుకోవాలన్నారు.
ఉన్నత విద్యలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో అడ్వాన్స్‌డ్ టాపిక్స్‌తో కోర్సులతో పీజీ ప్రోగ్రాములు రూపొందించాలని, అలాగే మూడు,నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించేలా ప్రణాళిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అటానమస్ కాలేజీల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముందన్న సీఎం.. రొబొటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా అనలటిక్స్ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలని సూచించారు.
జాతీయ అక్రిడిటేషన్ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్ విభాగాన్ని తయారు చేయాలన్న సీఎం జగన్.. విద్యా సంస్థలను అన్నింటినీ కూడా అక్రిడిటేషన్ వైపు నడిపించాలన్నారు. విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలు విజయనగరంలో ఇంజనీరింగ్ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, టీచర్ ఎడ్యుకేషన్ ఫోకస్‌గా ఒంగోలు యూనివర్సిటీ, కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్న అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యత ప్రమాణాలు పాటించని 200కు పైగా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపిన అధికారులు.. వారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని వివరించారు.