AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజారోగ్యంపై నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ విషయంలో రాజీ పడొద్దన్న ఏపీ ముఖ్యమంత్రి

ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు..

ప్రజారోగ్యంపై నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ విషయంలో రాజీ పడొద్దన్న ఏపీ ముఖ్యమంత్రి
Andhrapradesh CM YS Jagan
K Sammaiah
|

Updated on: Mar 02, 2021 | 6:38 PM

Share

ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యంగా ముందు సాగాలని సీఎం జగన్‌ చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటే వినిపించకూడదని.. ఎంత మంది అవసరమైతే అంత మందిని నియమించుకోవాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తదితరులు హాజరయ్యారు. ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలని.. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త నిర్మాణాలపై సీఎం జగన్‌ అధికారులతో చర్చించారు.

వైద్యం, విద్యా రంగాల్లో నాడు-నేడు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోపు పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూసేకరణ, ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని.. అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయో అవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలని సీఎం చెప్పారు. బెడ్‌షీట్ల దగ్గర నుంచి శానిటేషన్‌ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. రోగులకు ఇచ్చే గది, పడకలు, ఆస్పత్రి వాతావరణం, రోగులకు అందిస్తున్న భోజనం.. ఈ మూడు అంశాల్లో కచ్చితంగా మార్పులు కనిపించాలన్నారు. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని.. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారుచేయాలని సీఎం నిర్దేశించారు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు.

Read more:

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు