AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింటర్ సెషన్ అయినా సమ్మర్‌లా సెగలు పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.!

చలికాలం సమావేశాలైనా సమ్మర్‌లా సెగలు పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మూడురోజులుగా అసెంబ్లీలో వాగ్యుద్ధం పెరుగుతోందే తప్ప...

వింటర్ సెషన్ అయినా సమ్మర్‌లా సెగలు పుట్టిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.!
Venkata Narayana
|

Updated on: Dec 03, 2020 | 4:09 AM

Share

చలికాలం సమావేశాలైనా సమ్మర్‌లా సెగలు పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మూడురోజులుగా అసెంబ్లీలో వాగ్యుద్ధం పెరుగుతోందే తప్ప…ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఇళ్ల నిర్మాణంపై చర్చలో మొదలైన రచ్చ..పోలవరం ప్రాజెక్ట్‌పై వాదోపవాదాలతో బుధవారం సభ హైపిచ్‌కి వెళ్లింది. సస్పెండ్‌ అయ్యేందుకే.. కావాలనే టీడీపీ అసెంబ్లీలో రచ్చ చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. తాజాగా మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దాడికి దిగారనే ఆరోపణతో.. క్లైమెట్‌ మరింత హాట్‌హాట్‌గా మారింది. మార్షల్స్‌పై మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేలు దాడికి దిగారన్న ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు స్పీకర్‌ తమ్మినేని. సభలో మార్షల్స్‌పై దాడి ఘటనను ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేశారు. మరోవైపు, వరసగా మూడోరోజు కూడా సభనుంచి సస్పెండ్‌ అయ్యారు టీడీపీ సభ్యులు.

అయితే అసెంబ్లీ ప్రారంభమయ్యాక రెండోరోజు జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంగళవారం 12మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందుకు ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించి… సభనుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే టీడీపీ సభ్యులు వెళ్లకపోవటంతో మార్షల్స్‌ ఎంటరయ్యారు. బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మార్షల్స్‌ని..టీడీపీ సభ్యులు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమపై దాడికి దిగారని స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు అసెంబ్లీ మార్షల్స్‌. దీంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీనుంచి బయటికి పంపేందుకు ప్రయత్నించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరు సాంబశివరావు, సత్యప్రసాద్‌, బాలవీరాంజనేయులు తమపై దాడి చేశారని స్పీకర్‌కి మార్షల్స్‌ ఫిర్యాదుచేశారు. దీంతో దాడి ఘటనను ఎథిక్స్‌ కమిటీకి సిఫార్సు చేశారు స్పీకర్‌ తమ్మినేని. మార్షల్స్‌పై ప్రతిపక్ష సభ్యుల దాడి దురదృష్టకరమన్నారు స్పీకర్‌. సస్పెండైన ఎమ్మెల్యేలు బయటికి వెళ్లనందుకే మార్షల్స్‌ సభ లోపలికి వచ్చారన్న స్పీకర్‌… సభ్యులు సభా నియమాలను పాటించాలని సూచించారు.