AP Budget 2022 session Highlights: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలింది. సభ ప్రారంభమై గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే పెద్దయెత్తున నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు ప్రతిపక్ష సభ్యులు. వారి నినాదాలు, ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. వారి నినాదాల మధ్యే ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు గవర్నర్. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి మార్షల్స్ వచ్చే సమయానికి టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యలు వాకౌట్ చేయడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ‘టీపీకి ఒక విధానం అంటూ లేదు. క్షణికావేశాలు ఎక్కువ. ఆవేశంతో నిర్ణయం తీసుకుంటున్నారు. మళ్లీ అమల్లోకి వచ్చే సమయానికి ఆలోచనల్లో పడిపోతారు. సభకు రామని క్షణికావేశంలో చెప్పారు, మళ్లీ ఆలోచన మార్చుకున్నారు. టీడీపీ వాళ్లు వ్యక్తిగత స్వార్థం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మూడు రాష్ట్రాల బిల్లు విషయమై బీఏసీ మీటింగ్ పూర్తి అయిన తర్వాత విషయాలు వెల్లడిస్తాము.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం ముగిసింది. ప్రజా సంక్షేమం కోసం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలను గవర్నర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను రేపటికి వాయిదా వేశారు. మంగళవారం దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఉభయ సభలు సంతాపం తెలుపుతాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టను 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా యుద్దప్రాతిపదికన పనులు సాగుతున్నాయన్ని గవర్నర్ తెలిపారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవులను అభివృద్ధి చేశామని గవర్నర్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్‌ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ. 9,100 కోట్లు అందించాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం. వైఎస్‌ఆర్ కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ. 981. 88 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద ఏడాది రూ. 15వేల చొప్పున సాయం ఇచ్చాం. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ. 6,400 కోట్ల ఖర్చు చేశాము. 3 వేల కిలోమీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామ’ని గవర్నర్ చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘2021-22లో రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోనం చేకూర్చాం. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 1,416 కోట్ల సాయం అందించాం. వైఎస్‌ఆర్ వాహన మిత్ర కింద ఆటో, ట్యాక్సీ, డ్రైవర్లకు రూ. 770 కోట్లు సాయం. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించాం. జగనన్న వసది దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,304 కోట్లు జమ చేశాము. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామ’ని వివరించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. 2020-21 నుంచి మనబడి, నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగింని తెలిపారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమ్మడ ఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13,023 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
గవర్నర్ ప్రసంగం మొదలైన ప్రారంభం నుంచి సభలో నిరసనలతో హోరెత్తించిన టీడీపీ నాయకులు సభను వాకౌట్ చేశారు. సభ ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గవర్నర్ విశ్వభూషన్ అన్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. ‘రైతులు, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు ఏపీ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఉద్యోగుల పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాము. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయి.
టీడీపీ నాయకుల నిరసనల నడుమే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగం కొనసాగుతోంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి గాల్లోకి విసిరారు టీడీపీ నేతలు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కాపడలేని గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.