కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. అటు షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్డౌన్ సమయంలోనూ వరుస సినిమాలను రీలిజ్ చేస్తూ తెగ బిజీగా ఉండిపోయాడు. అంతే కాకుండా సొంతంగా ఆన్లైన్ థియేటర్ ఓపెన్ చేసి మరీ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. కాగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన మర్డర్ సినిమా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు సంబంధించినట్టుగా ఈ సినిమాను తీసినట్లుగా ట్రైలర్లో తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా తన కథ ఆధారంగానే చిత్రీకరించారని.. తమ కుటుంబ మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని.. వెంటనే ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ భార్య అమృత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కథ ఆధారంగానే వర్మ ఈ సినిమా తీశారని అమృత పిటిషన్లో పేర్కోంది. అంతేకాకుండా వర్మ తెలివితేటలు ఉపయోగించి తన కథనే సినిమాగా తీసి కోర్టును తప్పుదోవపట్టించారని, లాంచ్ పిటిషన్‌ను విచారించాలని అమృత హైకోర్టును కోరింది. కాగా అటు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ విచారణకు నిరాకరించడంతో చిత్ర యూనిట్ రేపు ‘మర్డర్’ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.