Amit Shah class: కిషన్ రెడ్డికి మళ్ళీ అమిత్‌షా క్లాస్
కేంద్ర హోంశాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డికి తన బాస్, హోం మంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. గతంలో ఓసారి తన నోటి దురుసుతో అమిత్ షా ఆగ్రహానికి గురైన కిషన్ రెడ్డి.. తాజాగా మరోసారి అదే పరిస్థితి ఎదురవడంతో షాక్ తిన్నట్లు తెలుస్తోంది.
Amit shah once again takes class to Kishan reddy: తెలంగాణకు చెందిన ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అమిత్ షా మరోసారి క్లాస్ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో హైదరాబాద్‌లో రోహింగ్యాలున్నారంటూ కామెంట్ చేసిన చివాట్లు తిన్న కిషన్ రెడ్డి తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో చివాట్లు తిన్నారని బీజేపీ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.
ఎన్నార్సీ అంశం జోరుగా ప్రచారంలో వున్న సందర్భంలో కిషన్ రెడ్డి ఎన్నార్సీని సమర్థిస్తూ మాట్లాడారు. మరో అడుగు ముందుకేసి.. హైదరాబాద్‌లో రోహింగ్యాలున్నారంటూ ఘాటైన కామెంట్ చేశారు. అప్పట్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమవడంతో ఆయన్ను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అమిత్ షా క్లాస్ పీకారంటూ వార్తలొచ్చాయి. దీన్ని ఆయన కూడా ఖండించలేదు.
తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. తెలంగాణ వాసులకు ఎర్ర బస్సే దిక్కంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణలో కలకలం కలిగించాయి. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కిషన్ రెడ్డి కించపరిచారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించినా పొలిటికల్ వార్ ఆగలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన కిషన్ రెడ్డికి అమిత్ షా మరోసారి క్లాస్ తసుకున్నారని పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. మంత్రి హోదాలో ఏదైనా మాట్లాడేప్పుడు ఆచీతూచీ స్పందించాల్సిన అవసరం వుందని, పదాల ఎంపిక చాలా ముఖ్యమని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.