తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. రోజు రోజుకు అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతోనే అన్ని పార్టీలు ఇప్పుడు ద్రావిడ దేశంపై దృష్టి పెట్టాయి. అంతే కాదు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోని కీలక నేతలు ఇప్పటికే ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రజనీ పార్టీ ప్రకటనతో పలువురు నేతలు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా డీఎంకే స్టాలిన్ సోదరుడైన అళగిరి.. తలైవా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో రజినీని కలుస్తానని చెప్పుకొచ్చారు. జనవరి 3న మద్దతుదారులతో భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాని అళగిరి వెల్లడించారు. తమిళనాడు మధురైలో అళగిరికి మంచి పట్టుండగా.. ఆ రాష్ట్రంలో మరో 5 నెలల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి.
అయితే.. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ స్థాపించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించడంతో మరింత ఉత్కంఠ మొదలైంది. తాజాగా అక్కడి రాజకీయాల్లో అలగిరి కూడా చురుకుగా మారడంతో ఒక్కసారిగా హీట్ మరింత పెరిగింది.
అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న తన తల్లి దయాళు అమ్మాళ్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 3న నా అనుచరులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నా.. కొత్త పార్టీని స్థాపిస్తాను అంటూనే.. రజినీ వచ్చిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు. అంతేగాని డీఎంకేకు మాత్రం మద్దతిచ్చేదిలేదని తేల్చి చెప్పారు.