తీరాన్ని తాకిన అక్వాన్ తుఫాను.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తీవ్ర తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్’ (Akvan) తీవ్ర తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాను బాహ్యవలయం ఇప్పటికే ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకిందని, ఇవాళ ఉదయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుఫాను పూర్తిగా తీరం దాటనుందని APSDMA ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అక్వాన్ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది కళింగపట్నంకి 110 కిమీ, విశాఖపట్నంకి 170కిమీ, గోపాల్‌పూర్‌కి 170 కిమీ, పూరీకు 250 కి.మీ, నరసాపురానికి 370కిమీ, దూరంలో కేంద్రీకృతం అయింది. దీని ప్రభావంతో ఇవాళ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ తెలిపారు.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్నందున శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వెదర్ అప్డేట్..
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉంది. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది.
భారీ వర్షాలు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 16 సెం.మీ, కంచిలి, కవిటిలో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.. అలాగే.. సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.
