అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు

|

Jun 12, 2020 | 10:41 AM

ఏపీ ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు
Follow us on

ఏపీ ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్ సీఎం వైఎస్ జగన్ కుట్రేనని ఆయన దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని.. ఆయన ఆచూకీని డీజీపీ వెంటనే వెల్లడించాలన్నారు. అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ తతంగం అంతా కూడా ప్రభుత్వం బలహీనవర్గాలపై చేస్తున్న దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ విషయంలో హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని.. అరెస్ట్ చేసేందుకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని.. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీనవర్గాలు, మేధావులు, ప్రజలు దీనికి నిరసన తెలియజేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.