అయిదు నెలల క్రితం ఎత్తేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దులో న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డే నియమించారు. ఈ బెంచ్ మంగళవారం నుంచి ప్రభుత్వ నిర్ణయంలో లీగాలిటీని పరిశీలించనున్నది.
ఆగస్టు 5వ తేదీ ఏ భారతీయుడు మరచిపోలేని రోజు. దశాబ్దాలుగా కశ్మీర్ డిస్ట్రబెన్స్‌కు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన రోజది. ఆరోజు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన ప్రసంగాన్ని ఏ భారతీయుడు మరచిపోలేడు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ వివాదానికి శాశ్వతంగా తెరదించినట్లయిందని కేంద్రం చెప్పుకుంది.
అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుమారు 32 వరకు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు సిజెఐ అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్.ఏ.కౌల్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు న్యాయబద్దంగా, చట్టబద్దంగా వుందనే అంశాన్ని ఈ సుప్రీం ధర్మాసనం విచారించనున్నది.