పుల్వామా ఉగ్రదాడిని మర్చిపోకముందే జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లం ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. వీరిలో ఓ ఆర్మీ మేజర్ కూడా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి అతి దగ్గర్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. అమరులైన భద్రతా సిబ్బంది 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారు. కాగా, ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారి కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు కూడా మృతి చెందినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.