
బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 35 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం వారిని బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విద్యార్థులు అల్పాహారంగా తీసుకున్నట్లు తెలిసింది. అతిసారం, వాంతులు రావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది.
గత నెలలో అదే పాఠశాలకు చెందిన 65 మంది విద్యార్థులు కలుషిత ఆహారాన్ని తిని అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. వారు ఆసుపత్రి నుండి రెండు రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు తాజా ఆహారం అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.