Vizianagaram: ఉమెన్ పవర్..! గజపతిరాజులు ఏలిన రాజ్యాన్ని శాసిస్తున్న మహిళా రాణులు..!

ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయనగరం ప్రాంతాన్ని పరిపాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ కనుమరుగై రాజ్యాంగ వ్యవస్థ అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు చట్టాలను అమలు చేస్తున్నారు.

Vizianagaram: ఉమెన్ పవర్..! గజపతిరాజులు ఏలిన రాజ్యాన్ని శాసిస్తున్న మహిళా రాణులు..!
Vizianagaram District Women Officials

Edited By:

Updated on: Mar 09, 2024 | 2:17 PM

ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయనగరం ప్రాంతాన్ని పరిపాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ కనుమరుగై రాజ్యాంగ వ్యవస్థ అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు చట్టాలను అమలు చేస్తున్నారు. వారే ఆయా ప్రాంతాలను పాలిస్తున్నారు.

అలా ఇప్పుడు విజయనగరం జిల్లాను మహిళా అధికారులు ఏలుతున్నారు. వారే చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పాలనా అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తూ అందరి మన్ననల్ని పొందుతున్నారు. వారిలో ప్రధానంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మీ ఒకరు. 2012 బ్యాచ్ కి చెందిన నాగలక్ష్మి ఇప్పుడు ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నడిపించడానికి తనదైన శైలిలో జిల్లా యంత్రాంగాన్ని దూకుడుగా నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె తీసుకుంటున్న పలు నిర్ణయాలు జిల్లా ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ గా తనకంటూ ఓ ముద్రవేసుకుంటున్నారు.

ఇక జిల్లాలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నడిపించాల్సిన మరో కీలక అధికారి జిల్లా ఎస్పీ కూడా మహిళా అధికారే. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఎస్పీగా మండవ దీపిక కొనసాగుతున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన దీపిక వివాదాలకు దూరంగా ఉంటూ పోలీస్ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు తన సిబ్బందిని సిద్ధం చేస్తూ ముందుకెళ్తున్నారు. దీపిక పనితీరును అటు జిల్లావాసులతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారిగా అనిత ఉన్నారు. సీనియర్ డిప్యూటీ కలెక్టర్ అయిన అనిత జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తూ తనదైన పనితీరును కనబరుస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ వివాదాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీగా ఫర్హానా బేగం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె ఎస్పీకి తన సహాయ సహకారాలు అందిస్తూనే జిల్లా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని సజావుగా నడిపిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం ఆర్డీవోగా డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ ఉన్నారు. ఈమె గతంలో అనేక చోట్ల కీలక అధికారిగా పనిచేసి ప్రస్తుతం విజయనగరంలో విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన విజయనగరం రెవిన్యూ డివిజన్ ను సమర్ధవంతంగా నడిపిస్తూ కీలక పాత్రను పోషిస్తున్నారు.

అంతేకాకుండా జిల్లా మత్స్యశాఖ అధికారి నిర్మల, జిల్లా సమాచార శాఖ డిపిఆర్ఓ జానకితో పాటు అనేకమంది జిల్లా అధికారులు కీలక బాధ్యతలు పోషిస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ మహిళలదే అగ్రస్థానం. ఒకప్పుడు మహా ఏలిన ఈ రాజ్యాన్ని ఇప్పుడు మహిళారాణులు పాలించడం ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…