
ఒకే గదిలో పదిమంది ఉన్నా.. దోమలు మాత్రం కొంతమంది చుట్టూనే తిరుగుతూ సంగీతం వినిపిస్తుంటాయి. “నన్నే ఎందుకు దోమలు కుడుతున్నాయి?” అని మీరు ఎప్పుడైనా విసుక్కున్నారా? అయితే దీని వెనుక కేవలం మీ రక్తం రుచి మాత్రమే కాదు మీ చర్మం విడుదల చేసే కొన్ని రసాయనాలు కూడా కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రకారం.. మన చర్మంపై ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లాల స్థాయిని బట్టి దోమలు ఆకర్షణ ఉంటుంది. ఎవరి చర్మంపై అయితే ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయో వారు ఇతరులకన్నా 100 రెట్లు ఎక్కువగా దోమలను ఆకర్షిస్తాయని సెల్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలిపింది.
శాస్త్రవేత్తలు ప్రజల చర్మం నుండి వెలువడే సహజ సువాసనలను సేకరించి, వాటిని దోమలున్న ప్రాంతంలో ఉంచి పరీక్షించారు. ఈ క్రమంలో మ్యాటర్ 33 నమూనాకు దోమలను విపరీతంగా ఆకర్షితమయ్యాయి. దీనిని లోతుగా విశ్లేషించగా, ఆ నమూనాలో అత్యధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లం ఉన్నట్లు తేలింది.
దోమలు కేవలం ఆకలితోనే మనల్ని వెతకవు.. వాటి యాంటెన్నా ద్వారా మన చర్మం విడుదల చేసే రసాయన మిశ్రమాన్ని గుర్తిస్తాయి. మనుషుల చర్మంపై రకరకాల రసాయనాలు ఉంటాయి. ఇవి చెమట ద్వారా బయటకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసనను విడుదల చేస్తాయి. దోమలు తమకున్న సున్నితమైన జ్ఞానేంద్రియాల ద్వారా ఈ వాసనను చాలా దూరం నుంచే పసిగడతాయి. డెంగీ, చికున్‌గున్యా వంటి రోగాలను వ్యాపింపజేసే ఈడిస్ ఈజిప్టి దోమలు ఈ రకమైన చర్మ వాసనలకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. మన చర్మం ఎంత వాసనను లేదా ఆమ్లాన్ని ఉత్పత్తి చేయాలో జన్యువులు నిర్ణయిస్తాయి. అందుకే కొందరిని దోమలు ఎప్పుడూ కుడుతూనే ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 70 కోట్ల మంది దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి దోమతెరలు, రిపెల్లెంట్లను వాడటం ఉత్తమం. సాయంత్రం వేళల్లో ఒళ్లు పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించాలి. చర్మంపై చెమట, దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కొంతవరకు వీటి బారి నుండి తప్పించుకోవచ్చు.