Bat Facts: నేల మీద నుంచి ఎగరలేని ఏకైక ఎగిరే జీవి.. గబ్బిలం గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా

పక్షుల్లా ఎగురుతాయి.. కానీ అవి పక్షులు కావు! జంతువుల్లా కనిపిస్తాయి.. కానీ నేల మీద నడవలేవు. అవే గబ్బిలాలు. ప్రపంచవ్యాప్తంగా 1,300 కంటే ఎక్కువ జాతులు ఉన్న ఈ వింత జీవులు.. ఎప్పుడూ తలక్రిందులుగానే ఎందుకు వేలాడుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గబ్బిలాల శారీరక నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bat Facts: నేల మీద నుంచి ఎగరలేని ఏకైక ఎగిరే జీవి.. గబ్బిలం గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా
Why Bats Hang Upside Down

Updated on: Dec 29, 2025 | 2:21 PM

గబ్బిలం.. వెన్నెముక కలిగిన ఏకైక ఎగిరే క్షీరదం. ఇవి పగటిపూట చీకటి గుహల్లో లేదా చెట్ల కొమ్మలపై తలక్రిందులుగా వేలాడుతూ కనిపిస్తాయి. అవి పడిపోకుండా అంత బలంగా కొమ్మలను ఎలా పట్టుకుంటాయి? నేల మీద నుంచి ఎగరడానికి వాటికి ఎందుకు సాధ్యం కాదు? గబ్బిలం ఒక అద్భుతమైన జీవి. ఇది పక్షి కాకపోయినా గాలిలో వేగంగా ఎగురగలదు. అయితే, పక్షుల్లాగా ఇవి నేల మీద నిలబడలేవు. దీనికి ప్రధాన కారణం వాటి కాళ్ల నిర్మాణం.

తలక్రిందులుగా ఎందుకు వేలాడుతాయి?

దుర్భలమైన కాళ్లు: గబ్బిలాల కాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. ఇవి తన శరీర బరువును మోయలేవు. అందుకే ఇవి నిటారుగా నిలబడలేవు.

టేకాఫ్ సమస్య: పక్షులు నేల మీద నుంచి గాలిలోకి ఎగరడానికి రెక్కలతో పాటు కాళ్లతో నెట్టే బలాన్ని ఉపయోగిస్తాయి. కానీ గబ్బిలాల కాళ్లు అంత బలంగా ఉండవు. కాబట్టి, ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు పడుతూ ఎగరడం వీటికి సులభం. అందుకే తలక్రిందులుగా వేలాడుతూ.. ఎగరాలనుకున్నప్పుడు జారిపోయి రెక్కలు విప్పుతాయి.

రక్షణ: తలక్రిందులుగా ఎత్తైన ప్రదేశంలో వేలాడటం వల్ల ఇతర శత్రువుల నుంచి వీటికి రక్షణ లభిస్తుంది.

అల్ట్రాసోనిక్ శబ్దాల మాయ: గబ్బిలాలకు కళ్లు ఉన్నా.. చీకటిలో వస్తువులను గుర్తించడానికి అవి శబ్ద తరంగాలను ఉపయోగిస్తాయి. ఎగురుతున్నప్పుడు అవి అల్ట్రాసోనిక్ శబ్దాలను విడుదల చేస్తాయి. ఆ శబ్దం ముందున్న వస్తువును తాకి వెనక్కి వచ్చినప్పుడు.. దాని దూరాన్ని బట్టి అవి తమ మార్గాన్ని మార్చుకుంటాయి.

మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:

పండ్ల గబ్బిలాలు: వీటి ముఖాలు నక్కల్లా ఉంటాయి, అందుకే వీటిని ‘ఎగిరే నక్కలు’ అంటారు.

గుండె వేగం: వీటి గుండె నిమిషానికి ఏకంగా 1,000 సార్లు కొట్టుకుంటుంది.

గ్వానో ఎరువు: గబ్బిలాల రెట్టలను (గ్వానో) రైతులు అత్యుత్తమ ఎరువుగా ఉపయోగిస్తారు.

జాగ్రత్త: గబ్బిలాలు కరిస్తే రేబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.