
Medak Children – Telangana Harita Haram: మెదక్ జిల్లాలో చిన్నపిల్లల ప్రయత్నం అందర్నీ అబ్బురపరుస్తోంది. వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటకింద బస్తీలో మొక్కల్ని సంరక్షిస్తోన్న విధానం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తెలంగాణ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా తమ వంతుగా వినూత్న ప్రయత్నం చేస్తున్నారీ చిన్నారులు.
వారం రోజుల నుండి వర్షాలు పడకపోవడంతో తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్ కు డబ్బా కట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకు నీళ్లు పోస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
మొక్కలకు నీళ్లు పోసేందుకుగాను ఈ చిన్నారులు ఓ డబ్బాకు రంద్రాన్ని పెట్టి, దానికి పైపును బిగించి తమ సైకిల్‌కు కట్టుకున్నారు. సమీపంలో ఉన్న చిన్న నీటి కుంట నుంచి నీటిని డబ్బాలో తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు పైప్ ద్వారా నీరందింస్తున్నారు.
తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ఆక్సిజన్ తో పాటు నీడనూ ఇస్తాయని చిన్నారులు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్థానిక పెద్దలు కూడా ఈ పిల్లలను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారు.
Children Green Effort