Trees Exploding: మంచుతో కప్పబడిన టెక్సాస్‌లో వింతలు జరుగుతున్నాయి. ఇక్కడ అర్ధరాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా భయపడుతున్నారు. గతేడాది వచ్చిన టెక్సాస్ ఫ్రీజ్ అనే మంచు తుపాను ఎఫెక్ట్ చెట్లపై పడింది. దీంతో వింత శబ్దాలు చేస్తూ చెట్లు పేలిపోతున్నాయి. ఈ చెట్లు ఎక్కువగా మంచు కురిసే ప్రదేశాల్లో పేలుతున్నాయి. దీనికి కారణం చెట్లలో ఉండే ప్రత్యేక రకమైన ద్రవం. దీనిని సాధారణ భాషలో సాప్ అంటారు. ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు అది గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. దీంతో చెట్లపై ఒత్తిడి పెరుగుతుంది. కొంత సమయం తర్వాత చెట్లు శబ్దాలు చేస్తూ బెరడు ఊడిపోవడం, కొమ్మలు విరగడం జరుగుతుంది. ఒత్తిడి బాగా పెరిగి చెట్టు కూడా విరిగిపోతుంది. దీంతో బారీ శబ్దాలు ఏర్పడుతున్నాయి.
టెక్సాస్ ప్రజలు ఏమంటున్నారు..
IFL సైన్స్ నివేదిక ప్రకారం.. టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌లో నివసించే లారెన్ రెబెర్ మాట్లాడుతూ.. ‘రాత్రంతా మేము కాల్పుల శబ్దాలు వింటూనే ఉన్నాం. దీనిపై పోలీసులకు సమాచారం అందించాం. పొద్దున్నే నిద్ర లేవగానే తెలిసింది అది చలికాలం చెట్లు పేలిన శబ్ధమని. రాత్రి కొద్ది సేపటి తర్వాత ఇలాంటి పేలుళ్ల శబ్దాలు వినిపిస్తాయి. ఇది మొదటి సారికాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి’
చలికాలంలో చెట్లు కూలిపోయే సంఘటనలు ఉన్నందున ఇంట్లోనే ఉండడం మంచి ఎంపిక అని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల మంచు తుఫాను కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌కు పడిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్సాస్ ప్రజలు చాలా రోజులు కరెంటు లేకుండా గడపవలసి వచ్చింది. అంతే కాదు తుపాను ప్రభావం రోడ్లపై స్పష్టంగా కనిపించింది. ఇక్కడ రోడ్లపై చెట్లు పడిపోయాయి. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.