ఎక్కడికెళ్లాలన్నా భయం, కొమురంభీం ఆసిఫాబాద్‌తో పాటు, కరీంనగర్ జిల్లాలోనూ పంజా విసురుతున్న రక్తం రుచిమరిగిన పులులు
మ్యాన్ ఈటర్ రిటర్న్స్. మధ్యలో ఎటెళ్లిందోగానీ మళ్లీ జనవాసాల్లోకొచ్చింది టైగర్. మూగజీవాలు బలవుతున్నాయేగానీ... పులిమాత్రం దొరకడం లేదు. తిరిగొచ్చాక..
మ్యాన్ ఈటర్ రిటర్న్స్. మధ్యలో ఎటెళ్లిందోగానీ మళ్లీ జనవాసాల్లోకొచ్చింది టైగర్. మూగజీవాలు బలవుతున్నాయేగానీ… పులిమాత్రం దొరకడం లేదు. తిరిగొచ్చాక ఏకంగా ఏడు మూగజీవాల రక్తం కళ్లచూసింది పులి. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 35 గ్రామాలు భయంతో వణుకుతున్నాయి. ఎన్ని ఉచ్చులు పన్నినా దొరకడం లేదు. అటవీశాఖ అధికారుల నిఘాకు చిక్కడం లేదు. పెడుతున్న ఎర మాత్రం పులి పంజాకి బలవుతోంది. ఎప్పుడు ఎక్కడ పులి విరుచుకుపడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు అటవీప్రాంత ప్రజలు.
జనవరి 24న ఆగర్‌గూడలో, 27న కమ్మర్‌గాం అటవీ ప్రాంతంలో, 29న దహెగాం మండలం రాంపూర్ చెరువు వద్ద, ఫిబ్రవరి 1న బెజ్జూర్ మండలం మానదేవర వద్ద , 2న తలాయి సమీపంలో జనం కంటపడింది టైగర్. దీంతో బెజ్జూర్ మండలం పెద్దసిద్దాపూర్, తలాయి, తిక్కపెల్లి, బీమారం, సులుగుపల్లి, జిల్లెడ, పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ, గుండెపల్లి, మొర్లిగూడ, కమ్మర్‌గాం, నందిగాం, దహెగాం మండలం దిగిడ, రాంపూర్, మెట్లగూడ, లోహ గ్రామాలు భయం గుప్పెట్లో బతుకుతున్నాయి. మహారాష్ట్ర నిపుణుల బృందం అందుబాటులో లేకపోవడంతో టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. పెద్దవాగు సమీప ప్రాంతాల్లోనే పులి దాడులకు దిగుతోంది. అయితే నీళ్లున్న చోట మత్తు మందు ప్రయోగం చేయకూడదనే నిబంధనలతో అటవీశాఖ వెనక్కి తగ్గుతోంది.
ఇక రాజన్నసిరిసిల్ల జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. కోనరావుపేట, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లో పొలాలు, ఊరి శివార్లలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. లేగదూడలతో పాటు మేకలపై చిరుతలు దాడిచేస్తున్నాయి. బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో ఈమధ్య ఓ చిరుతపులి బావిలో పడటంతో…మత్తిచ్చి బయటికి తీశారు. చిరుతపులుల సంచారంతో ప్రజలు పొలాలకెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. వ్యవసాయపనులకు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్తున్నారు. సాయంత్రం ఐదుకల్లా పశువులతో పాటు ఇళ్లకు చేరుతున్నారు. పులులున్నాయ్ జాగ్రత్తంటున్నారేగానీ…అటవీశాఖ అధికారులు పట్టుకోలేకపోతున్నారు. ఆ మధ్య భారీగా ఆపరేషన్ టైగర్ హంట్ చేపట్టినా పులి మాత్రం చిక్కలేదు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు, మిగిలిన చోట్ల చిరుతపులులు ఎప్పుడు దాడి చేస్తాయో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న అలికిడైనా అటవీగ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు