Bamboo Salt: కిలో ఉప్పు ధర రూ. 35,000.. ఇదేం దందా బాబోయ్! దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

ఉప్పు లేని ఇల్లు దాదాపు కనిపించదు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఉప్పు సాధారణంగా మనకు కిలో పది లేదా ఇరవై రూపాయలకే దొరుకుతుంది. కానీ, ప్రపంచంలో ఒక రకమైన ఉప్పు ఉంది, దాని ధర వింటే మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం! ఒక్క కిలో ఉప్పు కొనాలంటే మీరు ఏకంగా రూ.35,000 నుండి రూ.40,000 వరకు వెచ్చించాల్సిందే. అదే దక్షిణ కొరియాలో తయారయ్యే 'వెదురు ఉప్పు' (Bamboo Salt). దీనిని కొరియన్లు 'జుగ్యోమ్' అని పిలుస్తారు.

Bamboo Salt: కిలో ఉప్పు ధర రూ. 35,000.. ఇదేం దందా బాబోయ్! దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Benefits Of Korean Bamboo Salt

Updated on: Jan 29, 2026 | 8:07 PM

ఈ ఉప్పు తయారీ ప్రక్రియ వింటే ఇది ఎందుకు అంత ఖరీదో మీకు అర్థమవుతుంది. సముద్రపు నీటి నుండి తీసిన ఉప్పును కేవలం ప్యాక్ చేసి అమ్మేయకుండా, దానిని వెదురు కాండాల్లో నింపి, అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి.. ఇలా ఏకంగా 9 సార్లు ప్రక్రియను పునరావృతం చేస్తారు. దీనివల్ల వెదురులోని ఖనిజాలు ఉప్పులోకి చేరుతాయి. సుమారు 50 రోజుల కఠిన శ్రమ తర్వాత తయారయ్యే ఈ ఉప్పు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందని కొరియన్ల నమ్మకం. దీని గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియన్ వెదురు ఉప్పు ప్రత్యేకతలు:

కఠినమైన తయారీ విధానం: ఉప్పును వెదురు గొట్టాల్లో నింపి, బంకమట్టితో మూసివేస్తారు. దీనిని ఇనుప స్టవ్‌లలో పైన్ చెక్కల మంటపై 9 సార్లు కాలుస్తారు. చివరి దశలో 1000° సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల అది శిలాద్రవంలా మారి గడ్డకడుతుంది.

ఐదు రంగుల స్ఫటికాలు: ఈ ప్రక్రియ ముగిసేసరికి ఉప్పు తెలుపు, నలుపు, ఎరుపు, నీలం మరియు పసుపు రంగు స్ఫటికాలుగా మారుతుంది. దీనిని ‘పర్పుల్ బాంబూ సాల్ట్’ అని కూడా అంటారు.

రుచిలో వైవిధ్యం: సాధారణ ఉప్పు కేవలం ఉప్పగా ఉంటే, ఈ వెదురు ఉప్పులో కొద్దిగా తీపి రుచి (కామ్రోజాంగ్) కూడా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు: సాంప్రదాయ కొరియన్ వైద్యంలో ఈ ఉప్పును ఔషధంగా వాడతారు. ఇది శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

ధర ఎందుకు ఎక్కువ?: ఈ ఉప్పును తయారు చేయడానికి యంత్రాల కంటే శారీరక శ్రమ ఎక్కువగా అవసరమవుతుంది. ఒక బ్యాచ్ సిద్ధం కావడానికి 50 రోజులు పట్టడం ముడి పదార్థాల నాణ్యత వల్ల దీని ధర ఆకాశాన్ని తాకుతుంది.

కిలో రూ. 35,000 అంటే సామాన్యులకు ఇది అందని ద్రాక్షే! కానీ కొరియన్ వంటకాల్లో వారి సౌందర్య సాధనాల్లో ఈ ఉప్పుకు తిరుగులేని స్థానం ఉంది. రుచి కోసం కాకుండా, ఆరోగ్య పరమైన విలువల కోసమే ధనవంతులు దీనిని ఇంత ధర పోసి కొనుగోలు చేస్తారు.