Suravaram : ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి.. సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది.. స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి శ్రీ సురవరం : సీఎం

|

May 28, 2021 | 8:44 AM

CM KCR about Suravaram Pratapa Reddy : తెలంగాణ వైతాళికులు స్వర్గీయ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు..

Suravaram : ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి.. సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది.. స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి శ్రీ సురవరం :  సీఎం
Kcr On Suravaram
Follow us on

CM KCR about Suravaram Pratapa Reddy : తెలంగాణ వైతాళికులు స్వర్గీయ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రాజకీయ, సాంఘిక, సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కొనియాడారు. పురాణాలను, చరిత్రను, సామాజిక చైతన్యాన్ని, సాహితీ సృజనను వినూత్న కోణంలో ఆవిష్కరించి, తెలంగాణ వైభవాన్ని లోకానికి సాధికారికంగా సత్ప్రమాణాలతో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారని సీఎం పేర్కొన్నారు. ‘గోలకొండ పత్రిక’ ద్వారా వారు తీసుకొచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకమైనదన్నారు. హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన పండుగలు, సాంప్రదాయాల్లో నిగూఢంగా ఉన్న విలువలను శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చి, రామాయణంలోని ఎన్నో తెలియని కోణాలను సోదాహరణంగా వివరించి, తెలుగు ప్రజల సాంఘిక చరిత్రను ఆధారాలతో సహా నమోదుచేసిన ఘనత బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం గారికే దక్కిందని అన్నారు. తెలంగాణలో పండితులు, పద్యకవులు లేరనే మాటను సవాలుగా తీసుకొని ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రత్యేకంగా ముద్రించారు. తద్వారా, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది, తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి శ్రీ సురవరం అని సీఎం అన్నారు.

తెలంగాణ తేజోమూర్తి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తన రచనలు కార్యాచరణ ద్వారా తెలంగాణ సమాజానికి అందించిన స్ఫూర్తి తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. సురవరం 125 వ జయంతి (మే 28) ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏడాదిగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు.

Read also : PM Modi : కాసేపట్లో యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు