AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?

పాములు కుబుసం విసర్జించడం అనేది పెరుగుదలకు, ఆరోగ్యానికి సహజమైన ప్రక్రియ. పాత చర్మ కణాలు పెద్దవి కానందున, పాములు వాటిని తొలగించుకుంటాయి. ఈ సమయంలో పాములు అసౌకర్యంగా ఉండి, దృష్టి మందగించడంతో దూకుడుగా మారే అవకాశం ఉంది. కుబుసానికి విషం ఉండదు, కానీ పాము దగ్గర్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం.

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?
Snake Shedding
Ram Naramaneni
|

Updated on: May 17, 2026 | 8:38 AM

Share

పాములు కుబుసం విసర్జించడం అనేది వాటి జీవన చక్రంలో ఒక అనివార్యమైన, అద్భుతమైన ప్రక్రియ. దీనిని మౌల్టింగ్ లేదా ఎగ్డైసిస్ అని పిలుస్తారు. ఇది కేవలం పాముల్లోనే కాకుండా, అనేక బహుకణ జీవులలో కనిపించే ఒక సాధారణ విషయం. పాములు పెరుగుతున్నప్పుడు, వాటి చర్మంలోని కణాలు మనుషుల కణాల వలె విస్తరించవు. అందువల్ల, పాత చర్మ కణాలు (ఎపిథీలియల్ సెల్స్) చనిపోయి, పై పొరగా ఏర్పడతాయి. ఈ పొర కింద కొత్త, ఆరోగ్యకరమైన చర్మం అభివృద్ధి చెందుతుంది. పాత చర్మం బిగుతుగా, అసౌకర్యంగా మారినప్పుడు, దానిని వదిలించుకోవాల్సిన అవసరం పాముకు తెలిసిపోతుంది. కుబుసం విసర్జించే సమయంలో, పాము తన తలను కరుకు ప్రదేశాలపై రుద్ది ఒక చీలికను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత, తోక నుంచి తల వరకు మొత్తం పాత చర్మాన్ని నీట్‌గా వదిలించుకుంటుంది. ఇది పాముకు కొత్త ఉత్సాహాన్ని, తాజాదనాన్ని అందిస్తుంది. పాత చర్మం తొలగిపోయిన తర్వాత పాము మరింత చురుకుగా మారుతుంది. కుబుసం విసర్జన అనేది పాము వయస్సు, ఆహారం, జాతి, వాతావరణం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

చిన్న పాములు, అంటే రీసెంట్‌గా పుట్టినవి, రెండు వారాలకు ఒకసారి కూడా కుబుసం విసర్జించవచ్చు. అయితే, వయస్సు మళ్లిన పెద్ద పాములు సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే కుబుసం విడుస్తాయి. ఉష్ణోగ్రత, తేమ వంటి వాతావరణ పరిస్థితులు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. నిపుణుల వివరాల ప్రకారం, ఇది శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి చాలా అద్భుతమైన పరిణామం. పాములు కుబుసం విడిచే సమయంలో వాటి దగ్గరకు మనుషులు వెళ్లడం శ్రేయస్కరం కాదట. ఈ సమయంలో పాముల కళ్ళు నీలంగా మారి, దృష్టి మందగిస్తుంది. ఇది వాటికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొత్త చర్మం లోపల అభివృద్ధి చెందుతూ ఉండగా, పాత చర్మంపై కణాలు అసమానంగా ఉంటాయి. ఈ స్థితిలో పాములు చాలా ఒత్తిడికి లోనవుతాయి, ఆందోళన చెందుతాయి. దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. వాటిపై దాడి జరుగుతుందేమోనని భయపడి ఎక్కువగా రక్షణాత్మకంగా మారతాయి. కాబట్టి, ఈ సమయంలో పాములను డిస్టర్బ్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యం.

అన్ని పాములు కుబుసం విసర్జిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3000కు పైగా పాము జాతులు ఈ ప్రక్రియను అనుసరిస్తాయి. ఒక పాము కుబుసం విడవలేకపోతే, అది అనారోగ్యంతో ఉందని అర్థం. చర్మ వ్యాధులు, ఒత్తిడి, పోషకాహార లోపం లేదా ఇతర వ్యాధుల వల్ల పాములు కుబుసం విడవలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల, కుబుసం విసర్జన అనేది పాము ఆరోగ్యానికి సూచిక. పాము విడిచిన కుబుసాన్ని ముట్టుకుంటే విషం ఎక్కుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణల వివరాల ప్రకారం, కుబుసానికి విషం ఉండదు. అవి కేవలం చనిపోయిన చర్మ కణాలు మాత్రమే. పాము తన చర్మంపై విషాన్ని నింపదు. అయితే, కుబుసం విడిచిన ప్రదేశానికి వెళ్లడం మంచిది కాదు, ఎందుకంటే ఆ ప్రదేశంలో పాము ఉండే అవకాశం ఉంటుంది. అది దాని ఆవాసం కాబట్టి సహజంగానే అక్కడే ఉంటుంది. వాటిని బెదిరించడానికి ప్రయత్నిస్తే, అవి వేరే చోటికి వెళ్లిపోతాయి.

Follow Us