
అరటిపండు అనేది దాదాపు ప్రతి ఇంట్లో రోజూ తినే పండ్లలో ఒకటి. రోజంతా శరీరానికి శక్తినిచ్చే అరటిపండ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏమిటంటే అరటిపండ్లు కొద్ది రోజుల్లోనే నల్లగా మారడం. దాంతో అవి వాడిపోవడం లేదా కుళ్లిపోవడం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు అరటిపండ్లను సులభంగా ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.
అరటిపండ్లు త్వరగా నల్లబడకుండా ఉండాలంటే వాటిని కవర్ చేసి ఉంచడం మంచిది. అరటిపండ్లని ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి పెట్టడం ద్వారా అవి త్వరగా నల్లబడవు. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
అరటిపండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచే మరో పద్ధతి వాటిని వేలాడదీయడం. ఈ విధానంలో అరటిపండ్లకు గాలి తగులుతుంది ఫలితంగా అవి త్వరగా పండకపోగా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇంటి లోపల గాలి తగిలే ప్రదేశంలో వేలాడదీయడం మంచిది.
వెనిగర్‌ను ఉపయోగించడం కూడా అరటిపండ్లను సురక్షితంగా ఉంచే ఒక మంచి పద్ధతి. ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ కలపండి. ఇప్పుడు ఆ వెనిగర్ నీటిలో అరటిపండ్లను ముంచండి. ఇలా చేయడం వల్ల అరటిపండ్ల మీద కనిపించే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. అలాగే అవి తాజాగా ఎక్కువ రోజులు ఉంటాయి.
అరటిపండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిని చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. అయితే ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వీటి పైపొర మచ్చలతో మారిపోతుంది. కానీ అలా అయినా అవి తినడానికి అనుకూలంగానే ఉంటాయి. వీటిని ఉంచే ప్రదేశం గాలి తగిలే విధంగా ఉండాలి.
అరటిపండ్లు త్వరగా పండిపోకుండా ఉండాలంటే వాటిని ఇతర పండ్లతో కలిసి ఉంచకపోవడం మంచిది. ఇతర పండ్ల నుంచి విడుదలయ్యే ఎథిలీన్ వాయువు అరటిపండ్లు పండుటకు దోహదం చేస్తుంది. కాబట్టి వీటిని వేరుగా ఉంచడం ద్వారా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.