Divorce: పెళ్లంటే… తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు… అంతేనా? పెళ్లంటే.. రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం.. పెళ్లంటే.. ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకమే. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.
ఇక ప్రస్తుత తరుణంలో చిన్నపాటి మనస్పర్థలతో విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెళ్లైన నాలుగేళ్లకే విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇగో, అహంతో దంపతుల మధ్య ప్రేమ లోపిస్తోంది. ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ కోరుకోవడం, ప్రేమ వివాహాలు, ఆర్థిక బాధలతో విడిపోతున్నాయి పలు జంటలు. వరకట్నం వేధింపులు, సంతాన లేమితో విడాకులను తీసుకోవాలని తమ కుమారులను తల్లిదండ్రులు ప్రేరేపిస్తున్నారు.
విడాకులకు కారణాలు ఎన్నో ఉన్నాయి.అపనమ్మకం, ప్రేమ లేకపోవడం, లైంగిక సామర్థ్యం తగ్గడం, వివాహేతర సంబంధాలు, డబ్బు మీద వ్యామోహం, ఫారెన్ కల్చర్ ప్రభావం, అత్యధిక జీతాలు, అహం, వరకట్న వేధింపులు, స్త్రీ ఉద్యోగ -ఆర్ధిక స్వేచ్ఛ దుర్వినియోగం, ఒకరిమీద ఒకరు ఆధారపడకపోవడం, నైతిక విలువలు లోపించడం, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, 498A గృహహింస చట్టం దుర్వినియోగం ఇలా రకరకాల కారణాల వల్ల పెళ్లైన కొద్ది రోజులకే దూరమవుతున్నారు.
హైదరాబాద్‌లో విడాకులు తీసుకునేవారి కేసులు ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి. పురానీ హవేలీ ప్రాంతంలోని ఫ్యామిలీ కోర్టులో 1,310 విడాకులు కేసులు పెండింగ్, మెయింటెనెన్స్ కేసులు 39, ఒకటో అదనపు న్యాయస్థానంలో 1800 పెండింగ్ కేసులు, అలాగే కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో 600 పెండింగ్ కేసులు ఇన్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లో మరో ఫ్యామిలీ కోర్టు ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని 10 ఫ్యామిలీ కోర్టుల్లో రోజుకు 50 నుంచి 80 కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం. ఒక్కో కోర్టులో రోజుకు ఐదు కేసులు వస్తున్నట్లు వెల్లడవుతోంది. ఈ లెక్కన యేటా 18 వేల నుంచి 20వేల కేసులు నమోదవుతున్నట్లు అంచనా.
► 25-35 ఏళ్ల వయసు వారు 75శాతం
► 35 ఏళ్లు పైబడ్డ వారు 25శాతం
► పెళ్లైన ఏడాదికే విడాకులు కోరుతున్న వారు 60శాతం
► 2016లో విడిపోయిన జంటలు 3080
► 2017లో విడిపోవడానికి నిర్ణయించుకున్న జంటలు 3000
► 2020లో 1,692 కేసులు
► వీటిలో అత్తింటి వేధింపులకు సంబంధించి 1,226 కేసులు.
► దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారంటూ 208 కేసులు
► ఇతరత్రా నేరాలకు పాల్పడుతున్నట్లు 258 కేసులు.
► కోర్టుకొచ్చిన కేసుల్లో విడాకులు కోరుతున్న వారు 90 శాతం మంది ఉన్నారు.
► పెళ్లైన ఐదేళ్ల లోపు వచ్చే విడాకుల కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో 10 శాతం మందే కాపురం చేసేందుకు తిరిగి ఒప్పుకుంటున్నట్లు వివరాలు చెబుతున్నాయి.
► కొత్త కేసుల్లో విడాకుల కోసం వచ్చే వారిలో మహిళలు 76 శాతం ఉన్నాయి.
► 2020లో ఇది 60 శాతం.
► రోజుకు సగటున నమోదవుతున్న గృహ హింస కేసుల సంఖ్య 28.
► 2020లో గృహ హింస కేసులు 8,148 నమోదు.
► 2020 మార్చి- 2021 మార్చి వరకు గృహ హింస కేసులు 10,338 నమోదు.
► దేశంలో ఏడాదికి సగటున కోటి వివాహాలు.
► దేశంలో 90 శాతం అరెంజ్డ్ మ్యారేజెస్.
► హిందూ వివాహాలు 80శాతం.
► ఏడాదికి విడిపోతున్నవారు 13.6 లక్షలు.
► విడాకుల తీసుకునే వారి శాతం 1శాతం.
► విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్య అధికంగా ఉంది.
► ఇక ఈశాన్య రాష్ట్రాల్లో విడాకుల కేసులు ఎక్కువ ఉంది. మిజోరాంలో విడాకుల కేసులు అధికం ఉంగా, కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగానే ఉన్నాయి.
అమెరికాలో ప్రతి 1000 పెళ్ళిళ్లకు 400 విడాకులు తీసుకుంటున్నారు. ఇక భారత్‌లో విడాకులకు 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకు పట్టొచ్చు. అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పట్టవచ్చు. 1960తో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా విడాకుల కేసులు 251.8 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
బెలాసర్- 68 శాతం రష్యా- 65 శాతం, స్పీడన్ 64 శాతం, లాట్వివా 63 శాతం, ఉక్రేయిన్ 63 శాతం, చెక్ రిపబ్లిక్ 61 శాతం, బెల్జియం56 శాతం
ఫిన్లాండ్ 56 శాతం, బ్రిటన్-53 శాతం, అమెరికా 49 శాతం, ఫ్రాన్స్ 55 శాతం, జర్మనీ 41 శాతం, ఇటలీ-2.7 శాతం, చైనా 2.2 శాతం, భారత్‌లో-01 శాతంగా ఉంది.
ఇలా వివాహం అయిన కొద్ది రోజులకే చిన్నపాటి మనస్పర్థలతో విడిపోతున్న జంటలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భార్య భర్తల మధ్య ఎంత అవగాహన కల్పించినా.. చివరకు విడాకులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.