
తుఫాన్లు, భారత్ వంటి దేశాల్లో రుతుపవనాలు వర్షాలను తెచ్చిపెడుతుంటాయి. వర్షాలకు మరికొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కూడా కారణమవుతుంటాయి. కారణమేదైనా సరే.. తరచుగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధిక మొత్తంలో వర్షపాతం నమోదైతే వరదలు కూడా సంభవిస్తుంటాయి. ఇది సహజసిద్ధ వాతావరణ పరిస్థితే. కానీ ఎప్పుడూ వర్షమే కురియని ఎడారి నేలపై వరదలు సంభవిస్తే..? ఇది కచ్చితంగా ఓ ప్రమాద సంకేతమే. ప్రస్తుతం భూగోళంపై అదే జరుగుతోంది. మానవ తప్పిదాల కారణంగా పెరుగుతున్న ‘భూతాపం’ (Global Warming) అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతోంది. గతంలో ఎప్పుడూ చూడని తీవ్రత కల్గిన తుఫాన్లు, అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం, ఆకస్మిక వరదలు, టోర్నడో వంటి సుడిగాలుల బీభత్సాలు.. ఇలా ఒకటేమిటి అనేక రకాల సహజసిద్ధ ప్రకృతి వైపరీత్యాల సంఖ్య పెరుగుతోంది. వాటి తీవ్రత కూడా నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు, దశాబ్దాలుగా వర్షాలే కురవని ఎడారుల్లో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. నిత్యం వర్షం కురిసే రెయిన్ ఫారెస్ట్‌లలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. లక్షల ఎకరాల్లో అడవులు దావాగ్నిలో కాలి బూడిదైపోతున్నాయి. తాజాగా ప్రపంచంలో వైశాల్యంలోనే అతి పెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో వరదలు సంభవించాయి. ఏడాది మొత్తమ్మీద సగటున 5 మి.మీ వర్షపాతం కూడా నమోదుకాని ఈ ఎడారిలో భారీ వర్షాలు సంభవించడమే ఒక వింత కాగా, వరదలు సంభవించే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం...