కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కొందరు ముస్లిం యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ హిందూ వ్యక్తికి వారు అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తికి చివరి సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ యువకులు అంత్యక్రియలు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దాగుండవెల్లి గ్రామంలో కోవిడ్‌తో మరణించిన గట్టు బాలస్వామికి ముస్లిం యువకులు చివరి కర్మలు చేశారు. గట్టు బాలస్వామికి ముగ్గురు కుమారులు, ఇద్దర కుమార్తెలు. అయితే కుటుంబ సభ్యులు ఎవరూ చివరి కర్మలు చేయడానికి నిరాకరించారు.
దీంతో ముస్లిం యువత ముందుకు వచ్చి అంత్యక్రియలు చేశారు. పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు చేశారు. ఒక హిందువుకు ఆయన సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం పట్ల స్థానికులు అభినందించారు. సొంత కుటుంబ సభ్యులు రాకపోవడంపై ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తమకు సమాచారం అందిస్తే దహన సంస్కారాలు చేస్తామని వారు తెలిపారు.