Kuchipudi Dancer : చాలామంది అన్నదానం, అవయవదానం, నేత్రదానం గురించి వినుంటారు కానీ ఇక్కడ ఒక కూచిపూడి డ్యాన్సర్ తన జుట్టును దానం చేసింది. క్యాన్సర్ బాధితుల కోసం ఈ పనిచేసింది. ఉన్నతమైన మనసు గల ఆ మహిళ ఎవరో కాదు హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ ‘శ్రావ్యమానస’. ఇటీవల క్యాన్సర్ బాధితుల కోసం చాలామంది తమ హెయిర్ దానం చేస్తున్నారు. ఆ వరుసలోనే శ్రావ్యమానస ముందుకు వెళ్లింది. తన నృత్య కళ ద్వారా నిద్రాణమైన సమాజాన్ని తట్టి లేపుతూనే తన కురులను కూడా సామాజిక సేవలో భాగంగా దానం చేసింది శ్రావ్య. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు విషయాలను వెల్లడించింది.
చాలా మంది క్యాన్సర్ బాధితులు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉన్నారని, వారిలో కొంతమందిని ఇటీవలే తాను కలిశానని చెప్పింది. వాళ్ల బాధలకు చలించిపోయి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్యాన్సర్ పేషెంట్లు.. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స వల్ల తమ జుట్టు కోల్పోవడాన్ని చూశానని, అలాంటి వారికి తన జుట్టు ఉపయోగపడుతుందనే డొనేట్ చేసినట్లు శ్రావ్య తెలిపింది.
కురులు ఉంటేనే అందంగా ఉంటారని తాను అనుకోవడం లేదని, హెయిర్ డొనేషన్ వల్ల తనలోని తనను(ఇన్‌సైడర్)ను గుర్తించుకున్నానని, అందుకు గర్వపడుతున్నానని శ్రావ్య పేర్కొనడం విశేషం. కాగా ప్రొఫెషనల్ నృత్య కళాకారిణిగా.. సత్యభామ తదితర మేల్ రోల్స్ ప్లే చేసేటపుడు విగ్ ధరిస్తున్నానని చెప్పింది. ఎవరికి వారు ఆత్మవిశ్వాసంతో ఉండటమే నిజమైన అందమని వివరించింది.