Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్‌లో భారీగా డబ్బు పట్టుబడినట్లు నిత్యం అనేక వార్తలు వస్తుంటాయి. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సాధారణంగానే అక్రమ ఆదాయం కలిగినట్లు అనుమానం కలిగితే చాలు ఆదాయప పన్ను శాఖ అధికారులు వెంటనే దాడులు చేస్తారు. అక్రమ ఆస్తులను, లెక్కలు లేని సంపదను స్వాధీనం చేసుకుంటారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు నిలబెడతారు. కోర్టులో నేరం రుజువైతే వారు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే, ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు ఓకే.. మరి వారు స్వాధీనం చేసుకున్న సొమ్ము ఎటు పోతుందని? ఎప్పుడైనా సందేహం వచ్చిందా? మీకు కూడా అలాంటి ప్రశ్నే ఉత్పన్నమయితే, ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు ఎలా ఉంటాయి? వారు అక్రమ ఆస్తులను ఎలా జప్తు చేస్తారు? స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఏం చేస్తారు? వంటి వివరాలను తెలుసుకుందాం..
అసలు సెర్చ్ ఆపరేష్ ఎలా చేస్తారు?
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన, ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ అధికారి ఒకరు తన అనుభవాన్ని టీవి9 డిజిటల్‌తో పంచుకున్నారు. అసలు రైడ్స్ ఎలా చేస్తారు? లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకుంటారు? అనే దానిని వివరించారు. సంపద విషయంలో అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించి దాడులు చేయడం జరుగుతుందన్నారు. ఎవరు రైడ్‌కు వెళ్లాలి అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. సీనియర్ అధికారి నేతృత్వంలో సెర్చ్ వారెంట్ జారీ చేయడం జరుగుతుంది. అలా సెర్చ్ ఆపరేషన్ టీమ్ ఏర్పాటవుతుంది. ఆ టీమ్ లక్షిత వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. అయితే, లక్షిత వ్యక్తి వివరాలు, సోదాలు ఎక్కడ చేయాలి, వంటి వివరాలన్నింటీని చాలా గోప్యంగా ఉంచుతారు. సీల్డ్ కవర్‌లో వివరాలను పొందుపరుస్తారు. చివరి క్షణంలో ఆ వివరాలు తెలుసుకుని దాడులు చేయడం జరుగుతుంది అని వివరించారు.
ఆపరేషన్ ఎలా జరుగుతుంది?
సెర్చింగ్ టీమ్.. లక్షిత ఇంటికి వచ్చి సెర్చ్ వారెంట్ ఇస్తుంది. ఆ తరువాత సోదాలు మొదలవుతాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న చోటు, ప్రాంగణం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేదు. అలాగే ఆ వ్యక్తులు ఫోన్ వంటి పరికరాలు ఉపయోగించడానికి వీలు లేదు. బయటి వ్యక్తులతో మాట్లాడటానికి అవకాశం లేదు. అధికారులు అక్కడికక్కడే పరిస్థితిని బట్టి ఇతర నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా వాష్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే.. ఆదాయపు పన్ను అధికారిక అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు సెర్చింగ్ ఆపరేషన్ గంటలు దాటి, రోజుల తరబడి సాగే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో వంట చేసుకోవడం, వాష్ రూమ్‌కు వెళ్లడానికి అవకాశం ఇస్తారు.
జప్తు ఎలా?
రైడ్ చేసిన వ్యక్తి నుంచి వస్తువులను జప్తు చేయడానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. కంప్యూటర్లు, సిస్టమ్‌లోని హార్డ్ డిస్క్, తదితరాలను స్వాధీనం చేసుకుంటారు. అక్రమంగా, లెక్కలు చెప్పని ఆస్తులు, నగదు, నగలు అన్నింటినీ జప్తు చేస్తారు. జప్తు చేసిన వాటి వివరాలను నమోదు చేసి, సంబంధిత వ్యక్తి అందజేస్తారు. వారి నుంచి ధృవీకరణ తీసుకుంటారు. సెర్చ్ ఆపరేషన్ తరువాత స్టేట్‌మెంట్స్ కూడా తీసుకుంటారు.
స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేస్తారు?
జప్తు చేసిన ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏం చేస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. అయితే, అధికారులు జప్తు చేసిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇందులో కమిషనర్‌కు కమిషనర్‌కు లింక్ చేసిన అకౌంట్స్ ఉంటాయి. ఆ కౌంట్స్‌లో సీజ్ చేసిన సొమ్మును డిపాజిట్ చేస్తారు. ఆ తరువాత మొత్తం ఆస్తి, ఆదాయం వివరాలను చెక్ చేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎంత? వంటి వివరాలను నిర్ధారించుకుంటారు. ట్యాక్స్ డబ్బులు మినహా మిగతా సొమ్మును తిరిగి వారికి చెల్లిస్తారు.
(గమనిక: ఆదాయపు పన్ను శాఖ పనితీరు ప్రతిసారి ఒకేలా ఉండదు. ప్రతిసారీ ఒకే విధమైన చర్యలు తీసుకోవాల్సిన నిబంధనలేమీ లేవు. పైన పేర్కొన్న సమాచారం ఒక అధికారి అనుభవం ప్రకారం తెలియజేయడం జరిగింది. ఆదాయపు పన్ను శాఖ విధానాలు వేరే విధంగానూ ఉండొచ్చు. దీనిని టీవీ9 తెలుగుకు ఏమాత్రం సంబంధం లేదు)
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..