Cyber Crime: అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్నారా..? కేసు పెట్టిన ఫలితం లేదా.. అయితే ఇలా చేయండి!

| Edited By: Balaraju Goud

Feb 17, 2024 | 4:14 PM

సైబర్ నేరగాళ్ల వలలో మీరు చిక్కుకున్నారా..? అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్నారా..? కేసు పెట్టిన ఫలితం లేదని భావిస్తున్నారా..? డోంట్ వర్రీ.. బీ హ్యాపీగా ఉండండి..! మీ డబ్బు ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుంది అంటున్నారు తెలంగాణ పోలీసులు. అయితే నేరం జరిగిన వెంటనే ఆ పని చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయట..!

Cyber Crime: అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్నారా..? కేసు పెట్టిన ఫలితం లేదా.. అయితే ఇలా చేయండి!
Cyber Crime
Follow us on

సైబర్ నేరగాళ్ల వలలో మీరు చిక్కుకున్నారా..? అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకున్నారా..? కేసు పెట్టిన ఫలితం లేదని భావిస్తున్నారా..? డోంట్ వర్రీ.. బీ హ్యాపీగా ఉండండి..! మీ డబ్బు ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుంది అంటున్నారు తెలంగాణ పోలీసులు. అయితే నేరం జరిగిన వెంటనే ఆ పని చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయట..!

సైబర్ క్రైమ్.. నిత్యం ఈ మాటలు ఎక్కడో అక్కడ మనకు వినిపిస్తూనే ఉంటాయి. మనకు కలిసే వారిలో ఎవరో ఒకరు దీని బారిన పడినవారే. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల చేతుల్లో బలైనవారే. తీరా డబ్బు పోయాక లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లకు పరుగులు తీయడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కన్నా సైబర్ నేరాలు 70శాతం పెరిగాయని డీజీపీ రవిగుప్తా స్వయంగా చెప్పారు.. వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెబుతున్నారు. అందుకోసం సైబర్ నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు తీసుకున్నారు. ప్రజల్లో అవగాహన తెస్తున్న నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో, అలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండాలని అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

సైబర్ మోసాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బును నగర సైబర్ క్రైమ్ పోలీసులు రోజుల వ్యవధిలోనే తిరిగి రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 2024 జనవరిలో 63 కేసుల్లో రూ. 2.53కోట్లు బాధితుల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేశారు. గుజరాత్ తర్వాత ఇక్కడే అది సాధ్యం అయ్యింది. గతంలో సైబర్ కేసుల్లో పోగొట్టుకున్న డబ్బు రికవరీ అసాధ్యంలా మారేది. ఈ తరహా నేరాల్లో రికవరీ చేసేందుకు గుజరాత్ పోలీసులు అనుసరిస్తున్న విధానంపై సైబర్ క్రైమ్ పోలీసులు అధ్యయనం చేశారు. సైబర్ ఫిర్యాదులకు 1930 కాల్ సెంటర్ ఉండడం, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధానంగా ఆన్ లైన్ మోసాలపైనే పనిచేస్తుండడంతో రికవరీ వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నిందితుల బ్యాంకు ఖాతాలను ఎన్సీఆర్పీ, జాతీయ సైబర్ క్రైమ్ ఫిర్యాదుల పోర్టల్ ద్వారా పోలీసులు స్తంభింపజేస్తారు. నిందితులు బాధితుల డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం, క్రిప్టో కరెన్సీలోకి మార్చడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోసం జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని, అలా చేస్తే బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి డబ్బు ఇతర ఖాతాలకు మళ్లకుండా చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశాక దర్యాప్తు అధికారి సాయంతో బాధితుడు సంబంధిత న్యాయస్థానంలో సీఆర్పీసీ 457 సెక్షన్ ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

సైబర్ నేరంలో కోల్పోయిన డబ్బు స్తంభింపచేసిన ఖాతాల్లో ఉందని దాన్ని తిరిగి అప్పగించాలని అభ్యర్థన చేస్తే ఖాతా నుంచి బదిలీ అయిన తీరు, ఇతర ఆధారాలను న్యాయస్థానం పరిశీలించి డబ్బు తిరిగి బాధితులకు జమ చేయాలని బ్యాంకుల్ని ఆదేశిస్తుంది. దీన్ని అనుసరించి బ్యాంకులు తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తాయి. సైబరాబాద్ కమిషనరేట్ తరహాలోనే హైదరాబాద్, రాచకొండ పోలీసులు సైతం సైబర్ క్రైమ్ నేరాలను పూర్తి చేసేందుకు వారిని ఫాలో అవుతున్నారు. అయితే సొమ్ము పోయిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తే, ఫలితం ఉంటుందంటున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…