Honey Badger: నీ దూకుడు.. సాటెవ్వడు.. సింహాలకు, చిరుతలకు కూడా సుస్సు పోయిస్తుంది..

హనీ బ్యాడ్జర్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, అద్భుతమైన ధైర్యం, సాహసం, మందమైన చర్మం, పదునైన దంతాలు, బలమైన పంజాలతో అడవిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది విషపూరిత పాములు, తేళ్లను కరకరా నమిలి తినేస్తుంది. సింహాలు, హైనాలు, చిరుతపులుల వంటి పెద్ద జంతువులను కూడా ఎదుర్కొని తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. హనీ బ్యాడ్జర్ అడవిలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి.

Honey Badger: నీ దూకుడు.. సాటెవ్వడు.. సింహాలకు, చిరుతలకు కూడా సుస్సు పోయిస్తుంది..
Honey Badger Vs Lion

Updated on: Dec 06, 2025 | 3:09 PM

హనీ బ్యాడ్జర్.. రాటెల్ అని కూడా పిలువబడే ఈ జంతువు ఆఫ్రికా, నైరుతి ఆసియా, భారత ఉపఖండంలో విస్తరించి ఉంది. దాని ధైర్యం, దూకుడు మాములుగా ఉండవు. అడవికి రాజు అనే హోదా లేకపోయినా, యానిమల్ కింగ్‌డమ్‌లో దీనికి గౌరవం ఏ రాజుకూ తక్కువ కాదు. పదునైన దంతాలు, బలమైన పంజాలు, మందమైన చర్మం హనీ బ్యాడ్జర్‌ను అత్యంత సాహసోపేతమైన జీవిగా నిలుపుతాయి. మందమైన చర్మం కారణంగా దీనిపై ఇతర జీవులు దాడి చేయడం చాలా కష్టం. ఇవి కీటకాలు, క్షీరదాలు, పాములు, పక్షులతో పాటు దుంపలు, గడ్డలు, పళ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయి. హనీ బ్యాడ్జర్ దూకుడు స్వభావం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, కోపం వస్తే సింహంతో కూడా పోరాడటానికి సిద్ధపడుతుంది. ఇది కేవలం కొన్ని సెకన్లలోనే పాములను మట్టి కరిపించగలదు. విషపూరిత పాములను సైతం ఆహారంగా తీసుకుంటుంది. పాము విషం నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. కొండచిలువలను కూడా ఇది వేటాడగలదు. ధైర్యం, సాహసం దీనికి అతిపెద్ద ఆయుధాలు. హనీ బ్యాడ్జర్ అడవిలో ఏ జంతువుకూ భయపడని, ధైర్యంగా తన జీవన పోరాటాన్ని సాగించే ఒక అద్భుతమైన జీవి. తేనెటీగల లార్వా పట్ల వీటికి ఉన్న ఇష్టం కారణంగానే వీటిని హనీ బ్యాడ్జర్లుగా పిలుస్తారు. ఇది ఎలుక జాతికి చెందిన జీవి. ఎదురుగా ఉంది ఏ జీవి అయినా భయం లేకుండా దూసుకెళ్తాయి. తమ జోలికి వచ్చినవాటిని చీల్చి చెండాడతాయి. అందుకే ఇతర జీవులు వీటి జోలికి రావడానికి భయపడతాయి.

హనీ బ్యాడ్జర్లు ఎటువంటి ప్రదేశాల్లో అయినా జీవించగలవు. చెట్టు తొర్రలు,  నక్కల బొరియలను తమ నివాసంగా మార్చుకుంటాయి. రోజులో ఎక్కువ భాగం నిద్రపోతాయి. నేలలో ఐదు అడుగుల లోతులో తొమ్మిది అడుగుల పొడవైన గొయ్యి తవ్వి రెస్ట్ తీసుకుంటాయి. ఏడాది పొడవునా పునరుత్పత్తికి సిద్ధంగా ఉండే ఈ జీవులు, ఒంటరిగా తిరగడానికి ఇష్టపడతాయి. ఏడు నుంచి పది వారాల గర్భం తర్వాత తల్లి హనీ బ్యాడ్జర్ బిడ్డను కంటుంది.  ఇవి సగటున 16 ఏళ్ల పాటు జీవిస్తాయి.  ఈత కొట్టడంలో, చెట్లు ఎక్కడంలో హనీ బ్యాడ్జర్స్ తోపులు అనే చెప్పాలి.

మన దేశంలో హనీ బ్యాడ్జర్లను వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972లో షెడ్యూల్ వన్ జంతువుగా గుర్తించారు. సింహం, పులి వంటి జంతువులకు ఉండే ప్రాధాన్యం వీటికీ ఉంది. 25 నేషనల్ జూ పార్కుల్లో వీటిని సంరక్షిస్తున్నారు.