పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్.. కాదు కాదు కత్తుల కిషన్ కళానైపుణ్యం ఎల్లలు దాటింది. 2011లో మూడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పోటీల్లో సైతం పాల్గొన్నాడు. 23 కత్తులు గొంతులో పెట్టుకొని ఇటలీ రోమ్ నగరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు దేశ, విదేశాల్లో కూడా తన ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కానీ కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ప్రదర్శనల్లేక స్వగ్రామం చిన్నకల్వలకు వచ్చేశాడు. కిషన్‌కు ఓ తల్లి, భార్య, ఐదుగురు కూతుళ్లు. వాళ్ల పెళ్లిళ్లు చేయడానికి పదిహేను లక్షల అప్పు చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గతంలో పక్క ఊరిలో ఓ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అది కూడా నడవక అప్పులపాలయ్యాడు. పూట గడవడం కష్టంగా మారడంతో మెషీన్ పనికి వెళ్లాడు. ఓ రోజు యాక్సిడెంట్ జరగడంతో ట్రీట్మెంట్ కోసం మరో రెండు లక్షలు అప్పు చేశాడు. ప్రస్తుతం ఇప్పుడు అతడు కొద్దిగా కోలుకున్నాడు. తన కుటుంబాన్ని పస్తులుంచలేక ఓ మైక్ పట్టుకొని మోపెడ్ మీద అప్పడాలు అమ్ముతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. మూడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టి రాష్ట్రం పేరు, ప్రఖ్యాతిని నిలిపిన కిషన్ కుటుంబానికి పూట గడవడమే కష్టతరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోకపోతే చావే శరణ్యమంటున్నారు కిషన్ కుటుంబసభ్యులు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: స్మశానవాటికలో అస్థిపంజరంతో నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు