
గ్యాస్ సిలిండర్ ఇంట్లో వంటకు ఎంత ముఖ్యమో, దాని భద్రత కూడా అంతే ముఖ్యం. సిలిండర్‌పై ఉండే గడువు తేదీని సరిగా గుర్తించకపోవడం వల్ల పెను ప్రమాదాలు జరగవచ్చు. సిలిండర్‌పై ఉన్న కోడ్‌ను ఎలా చదవాలో తెలుసుకుని జాగ్రత్తగా ఉండొచ్చు.
గ్యాస్ సిలిండర్ పైన మూడు లోహపు పట్టీలు ఉంటాయి. వాటిలో ఒక పట్టీపై నలుపు రంగులో ‘A, B, C, D’ వంటి అక్షరాలతో కూడిన ఒక కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ ఏ సంవత్సరంలో, ఏ త్రైమాసికంలో గడువు ముగుస్తుందో సూచిస్తుంది.
ఈ కోడ్ రెండు భాగాలుగా ఉంటుంది: ఒక అక్షరం, రెండు అంకెలు.
అక్షరం (A, B, C, D): ఇది సంవత్సరాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజిస్తుంది.
A – జనవరి నుంచి మార్చి వరకు.
B – ఏప్రిల్ నుంచి జూన్ వరకు.
C – జులై నుంచి సెప్టెంబర్ వరకు.
D – అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు.
అంకెలు (ఉదాహరణకు, 25): ఇది గడువు ముగిసే సంవత్సరాన్ని సూచిస్తుంది. 25 అంటే 2025.
ఉదాహరణ:
మీ సిలిండర్‌పై D-26 అని ఉంటే, ఆ సిలిండర్ గడువు 2026 సంవత్సరంలో డిసెంబరు నెలలో ముగుస్తుందని అర్థం.
గడువు ముగిసిన సిలిండర్‌ను వాడటం ప్రమాదకరం. ఆ తర్వాత సిలిండర్ లోపలి భాగం బలహీనపడటం వల్ల లీకేజీలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల, డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్‌ను తెచ్చినప్పుడు ఈ కోడ్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి. ఒకవేళ గడువు ముగిసిన సిలిండర్ ఇస్తే, దానిని తిరస్కరించి, సంస్థకు ఫిర్యాదు చేయాలి