Fact Check: మన సోషల్ మీడియా రచయితల పనితీరు అదిరిపోతుంది..ఇదిగో తోక అంటే, అదిగో పులి అనగలరు.. జనాలతో అనిపించగలరు. ఒకవేళ ప్రజానీకం అనకపోయినా అనేదాకా ఆ రచన గిరిగిరా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ అంటే, ఎవరో ఒకరు ఇందులో నిజమెంత అని తెలుసుకునేంత వరకూ.. ఇదిగో ఇప్పుడు మీకు అలాంటి ఒక వైరల్ రచన.. అందులోని నిజానిజాలు చెప్పబోతున్నాం..
కరోనా ఎలా వచ్చిందో మీకు తెలుసా? మీకే కాదు దానిని మన మీదకు వదిలాడని మనం చెప్పుకుంటున్న చైనా వాడికి కూడా తెలీకపోవచ్చు. కానీ, మన సోషల్ మీడియా రచయితలు కనిపెట్టేశారు. వాళ్ళేమి చెప్పారంటే..5 జి పరీక్ష వల్ల
కరోనా మహమ్మారి వచ్చిందట. అవును ఒక పక్క టెక్నాలజీ పెంచడానికి 5 జి పరీక్ష కోసం ప్రభుత్వం అన్ని సంస్థలను ఆమోదిస్తోంది.. అయితే, ఈ పరీక్షల వల్ల కరోనా మహమ్మారి వచ్చేసింది అని సోషల్ మీడియాలో ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ సందేశంలో, 5 జి టవర్లను పరీక్షించడం వల్ల భారతదేశంలో COVID-19 యొక్క రెండవ వేవ్ వచ్చిందని పేర్కొన్నారు. “పాత తరం మొబైల్ నెట్‌వర్క్ (4 జి) పక్షులను చంపినట్లే, 5 జి నెట్‌వర్క్ జంతువులను, మానవులను మాయం చేసేస్తుంది” అని ఈ సందేశం పేర్కొంది. దీనితో పాటు, ఈ పోస్ట్‌లో ఈ 5జి టవర్లను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తున్నారు. ఇక హిందీలో ఉన్న ఈ పోస్ట్ లో ఈ 5జి టవర్లను పరీక్షించడం వల్ల కరోనా రెండో వేవ్ వచ్చింది. దీనివలన వెలువడుతున్న రేడియేషన్ గాలిని విషపూరితం చేస్తోంది. అందువల్ల మనుషులకు ఆక్సిజన్ అందడం లేదు. దీంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయి అంటూ ఇందులో రాసుకొచ్చారు.
ఇందులో నిజం ఉందా? సందేహమే ఆక్కర్లేదు ఏమాత్రం నిజం లేదు. అందుకు మొదటి కారణం.. 5జి నెట్ వర్క్ కోసం ఇంకా ట్రయల్స్ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఈ మధ్యనే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కంపెనీలకు 5జి ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి అనుమతి ఇచ్చింది. అందువల్ల ఈ నెట్ వర్క్ వల్ల కరోనా వచ్చేసింది అనడం సరికాదు. ఇక మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కోవిడ్-19 కి మొబైల్ నెట్ వర్క్ కీ ఏమాత్రం కనెక్షన్ ఉన్నట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. కాబట్టి వైరల్ గా మారిన ఈ పోస్ట్ పూర్తిగా తప్పు.
Also Read: Hyderabad Temples: కోవిడ్ ఎఫెక్ట్.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత