Elephants Attacking On Villages in Chittoor district: చిత్తూరు జిల్లా పలమనేరులో ఆసక్తికర ఘటన జరిగింది.. కరెంట్ షాక్ తో చనిపోయిన గున్న ఏనుగు కోసం ఏకంగా ఏనుగుల గుంపు గ్రామాల మీదికి దండెత్తింది.. సరిగ్గా ఏనుగుని పూడ్చి పెట్టిన చోటికి వెదుక్కుంటూ వచ్చిన ఏనుగుల గుంపు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించాయి. ఒక మనిషి చనిపోతే పది మంది వస్తారో రారో గ్యారంటీ లేదు. ఈ కరోనా సమయంలో అయితే, కనీసం కడుపున పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రుల శవాల దగ్గరకు రాని ఘటనలు అనేకం ఉన్నాయి.. కానీ చిత్తూరు జిల్లాలో ఏనుగుల ప్రేమ మనుషుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
రెండు రోజుల క్రితం పలమనేరు మండలం కోతిగుట్ట సమీపంలో ఒక గున్న ఏనుగు వచ్చింది. ఏనుగుల మందలోంచి తప్పించుకుని వచ్చిన ఆ ఏనుగు.. తమ వారి కోసం గాలిస్తూ తిరుగుతోంది.. అదే క్రమంలో కరెంట్ స్తంభాన్ని పడగొట్టింది.. దీంతో కరెంట్ వైర్లు మీద పడి ఆ గున్న ఏనుగు స్పాట్‌లోనే చనిపోయింది.. అధికారులు అక్కడికి చేరుకుని దాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. అయితే గున్న ఏనుగు చనిపోయిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చింది ఏనుగుల గుంపు .. అసలు అవి ఆ ప్రదేశాన్ని ఎలా గుర్తు పట్టాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు..
ఏనుగుల ఆగ్రహం – ఆవేదన
గున్న ఏనుగుని పూడ్చి పెట్టిన చోట చుట్టూ తిరుగుతూ తమ బాధని వ్యక్తం చేశాయి. పెద్దగా అరుస్తూ బీభత్సం సృష్టించాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏనుగుల గుంపు ఆ ప్రదేశంలో హల్‌చల్ చేశాయి.. పంటపొలాలను నాశనం చేస్తూ తమ కోపాన్ని ప్రదర్శించాయి.. ఆ ఏనుగుల గుంపు ఇంకా అక్కడే తచ్చాడుతోంది.. దీంతో సమీప గ్రామల ప్రజలు హడలిపోతున్నారు.. భయంతో బిక్కచచ్చిపోతున్నారు.
గతంలోనూ ఇలాగే ఏనుగుల గుంపు చనిపోయిన ఏనుగు దగ్గరకు వచ్చిన ఘటనలు ఉన్నాయి..అయితే అపుడు అక్కడ చనిపోయిన ఏనుగు శరీరం ఇంకా అలాగే ఉంది.. కాబట్టి అది తమ ఏనుగేనని గుర్తుపట్టి అలా చేశాయని అనుకోవచ్చు. కానీ, ఇపుడు అక్కడ ఏనుగు లేదు..పూడ్చిపెట్టారు. మరి పూడ్చేసిన చోటును అవి ఎలా గుర్తించాయి.. సరిగ్గా పూడ్చిన ప్రదేశానికే అవి ఎలా రాగలిగాయి..? చిత్రంగా ఉంది కదూ!
— అశోక్ వేములపల్లి, టీవీ 9, తిరుపతి
Read Also….