నేటి యువత నిత్యం ఎలక్ట్రానిక్ గాడ్జట్స్‌తో దోస్తీ చేస్తున్న వారే అధికంగా కనిపిస్తున్నారు. పోటీ ప్రపంచంలో పడి తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. కానీ వీళ్ళు. మాత్రం 60 ఏళ్ల పైబడిన వయసులో ‘కృష్ణా..రామా’ అనుకుంటూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయకుండా నేటి తరం యువతకు ఆదర్శ మవుతున్నారు. యువతకు ఎందుకు ఆదర్శమయ్యారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
మహారాష్ట్రలోని షోలాపూర్ చెందిన శ్రీశైల్ నవ్‌లా (65), విట్టల్ కదం(79) ఇద్దరూ స్నేహితులు. పిల్లల పెళ్లిళ్లు చేసి, బాధ్యతల భారం దించుకున్నారు. ‘కృష్ణా..రామా’ అనుకుంటూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయకుండా మిగిలిన కాలాన్ని తీర్థయాత్రలకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కార్లు, బస్సుల్లో కాకుండా సైకిళ్లపై చుట్టి వస్తున్నారు. ఈ ఇద్దరు మిత్రులు. షోలాపూర్ నుంచి ఒడిశాలోని జగన్నాథపురికి సైకిళ్లపై వెళ్లాలనుకున్నారు.
ఐదు రోజుల క్రితం బయలుదేరిన ఆ ఇద్దరు మిత్రులు మార్గమధ్యలో నల్లగొండ జిల్లా చిట్యాలకు చేరుకున్నారు. జగన్నాథపురికి రాకపోకలకు 20 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 15న షోలాపూర్ నుంచి కన్యాకుమారికి 3200 కి.మీ. సైకిళ్లపై ప్రయాణించి మార్చి 12న ఇంటికి చేరుకున్నారు. గతేడాది అక్టోబరు 15న షోలాపూర్ నుండి సైకిళ్లపై బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని కేదారీనాథ్, బద్రీనాథ్, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాలను(3600కి.మీ ప్రయాణించి) డిసెంబరు 1న ఇంటికి చేరుకున్నారు ఈ వృద్ధ యువకులు.
వృద్ధాప్యంలో ఏదో ఒక వ్యాయామం ఉండాలని, తాము సైకిల్‌పై ప్రయాణించడాన్ని వ్యాయామంగా ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. ఇంకో విశేషమేమంటే విట్టల్ కదం గత పదేళ్లుగా మౌనవ్రతంలోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. బద్ధకిస్తులుగా మారుతున్న నేటి తరం యువతకు నిజంగానే వీరు ఆదర్శప్రాయం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..