AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం

బంగారానికి తుప్పు పడుతుందనేది ఒక అపోహ. వాడని బంగారు ఆభరణాలు తుప్పు పట్టవు కానీ, వాటి స్వచ్ఛతను బట్టి పాతబడతాయి లేదా వాటిలోని ఇతర లోహాల కారణంగా పసుపు రంగు పొర ఏర్పడవచ్చు. లోహ శాస్త్రం ప్రకారం, తుప్పు కేవలం ఇనుముకు మాత్రమే పడుతుంది. బంగారం ఒక స్థిరమైన లోహం కాబట్టి రసాయనికంగా స్పందించదు.

బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం
Gold
Ram Naramaneni
|

Updated on: May 31, 2026 | 4:17 PM

Share

బంగారు ఆభరణాలు వాడకుండా దాచిపెడితే తుప్పు పడతాయా లేదా తమ వన్నె కోల్పోతాయా అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. అసలు బంగారానికి తుప్పు పడుతుందా? తుప్పు అంటే ఏమిటి? అన్న విషయాలపై నిపుణులు స్పష్టతనిచ్చారు.

తుప్పు అంటే ఏమిటి?

రసాయన శాస్త్ర నిపుణుల ప్రకారం, తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహ శాస్త్రం ప్రకారం, కేవలం ఇనుము, ఇనుము మిశ్రమంగా ఉన్న లోహాలకు మాత్రమే తుప్పు పడుతుంది. తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో రసాయన చర్య జరిగి, ముదురు ఎర్ర రంగు పొర ఏర్పడుతుంది. దీన్ని రస్టింగ్ అంటారు. ఇలాంటి పొర ఏర్పడిన తర్వాత తగిన చర్యలు తీసుకోకపోతే లోహం క్రమంగా తన సహజ రూపాన్ని కోల్పోయి నశిస్తుంది. నట్లు, బోల్టులు, ఫ్యాన్లు, సైకిల్ చైన్లు వంటి వాటికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీసింగ్ వంటి మార్గాల ద్వారా తుప్పు పట్టకుండా చూస్తారు.

బంగారం తుప్పు పట్టదు: ఎందుకు?

బంగారాన్ని నోబెల్ ఎలిమెంట్ అంటారు. బంగారు అణువులు అత్యంత స్థిరంగా ఉంటాయి. అందుకే గాలి, నీరు, తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో కూడా స్వచ్ఛమైన బంగారం రసాయన పరిమాణం మారదు. ఇది సాధారణ యాసిడ్లకు స్పందించదు. కేవలం ఆక్వా రెగియా అనే ఆమ్లంలో మాత్రమే కరుగుతుంది. ఈ స్థిరత్వం కారణంగానే బంగారాన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులలో కూడా విస్తృతంగా వాడుతారు. సో.. బంగారం ఎప్పుడూ తుప్పు పట్టడం అనేది జరగదు. తక్కువ స్వచ్ఛత గల 14 క్యారెట్ల బంగారం సహా ఏ బంగారు ఆభరణాలు కూడా తుప్పు పట్టవు. బంగారు ఆభరణాలు వాడినా లేదా వాడకుండా దాచిపెట్టినా పాతబడతాయి కానీ తుప్పు పట్టవు. ఎక్కువ కాలం ఆభరణాలు ధరిస్తే ఒక పసుపు పచ్చ రంగు పొర ఏర్పడవచ్చు గానీ, అది తుప్పు కాదు. ఈ పొర బంగారానికి బలం పెంచడానికి కలిపే రాగి వంటి ఇతర లోహాల వల్ల ఏర్పడుతుంది.

ఇతర లోహాల పరిస్థితి ఏమిటి?

వెండి కూడా నోబెల్ ఎలిమెంటే, కానీ గాలిలో ఉండే సల్ఫర్ తో చర్యకు గురవుతుంది. ఇత్తడి, రాగి లోహాలు కూడా తుప్పు పట్టవు. ఇత్తడి అనేది జింక్, రాగి మిశ్రమం. ఇది వాతావరణం కారణంగా జింక్ లో రసాయన మార్పులు జరిగి రంగు మారవచ్చు, కానీ తుప్పు పట్టదు. రాగి కూడా తుప్పు పట్టదు, అయితే ఏళ్ల తరబడి వాడిన తర్వాత పచ్చ రంగు మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు. రాగి బలమైన యాసిడ్లకు రియాక్ట్ కాదు.

కాబట్టి, బంగారు ఆభరణాలు వాడకుండా దాచిపెట్టినా, అవి తుప్పు పట్టవు. ఆభరణాలు కేవలం కాలక్రమేణా పాతబడతాయే తప్ప వాటికి ఇనుము వలె తుప్పు పట్టే ప్రమాదం లేదు.

Follow Us