Tsunami: 16 ఏళ్ల కిందట రాక్షస అలలు లక్షల మందిని మింగేసిన భీకర సన్నివేశం గుర్తుండే ఉంటుంది. 2004 డిసెంబరు 26న హిందూమహా సముద్ర గర్భంలో సంభవించిన భారీ భూకంపం ప్రళయాన్ని సృష్టించింది. ఈ జల విలయం కారణంగా భారత్ సహా 14 దేశాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లింది. ఇక ఇండోనేషియా దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సునామీ విలయంలో చిక్కుకుని 2.28 లక్షల మంది మృత్యువాత పడగా.. ఒక్క ఇండోనేషియాలోనే 1.68 లక్షల మంది జల సమాధి అయ్యారు. అంతటి భయానక పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు గుర్తుచేసుకుంటే హడలిపోతారు. అయితే, ఘటనకు సంబంధించి తాజాగా సంతోషకరమైన వార్త ఒకటి వెలుగు చూసింది.
2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీలో గల్లంతైనట్లు నిర్ధారించిన ఓ పోలీసు అధికారి 16 ఏళ్ల తరువాత ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడని ప్రకటించిన వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలతో కనిపించడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతను మునుపటిలా కాకుండా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసు అధికారి అయిన అబ్రిప్ అసెప్.. 2004లో హిందూ మహాసముద్రం ఇండోనేషియాను తాకినప్పుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సునామీ సృష్టించిన విలయంలో అసెప్ కూడా చిక్కుకున్నాడు. సముద్ర శాంతించిన తరువాత అసెప్ కోసం కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. దాంతో అబ్రిప్ అసెప్ జల విలయంలో కొట్టుకుపోయాడని అధికారులు ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులు కూడా అతను చనిపోయి ఉంటాడని ఫిక్స్ అయ్యారు. ఇంతకాలం అతని జ్ఞాపకాలతోనే గడిపేశారు. అయితే తాజాగా మీడియాలో అతని ఫోటోలు కనిపించడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు. అతను అసెప్ అని, చనిపోయాడనుకున్న వ్యక్తి బ్రతికే ఉన్నాడని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి అధికారులు, మీడియా సహకారంతో అసెప్ కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు.
అయితే, అసెప్ మునపటిలా ఆరోగ్యంగా లేకపోవడం దురదృష్ట కరం అని చెప్పాలి. ఆ ప్రకృతి విలయాన్ని కళ్లారా చూసిన అసెప్.. మానసికంగా చలించిపోయాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అసెప్‌కు మత్రి బ్రమించింది. తన బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరనేది పూర్తిగా మర్చిపోయాడు. కాగా, వరదల్లో కొట్టుకువచ్చిన అసెప్‌ను ఇండోనేషియాలోని అషే ప్రావిన్స్‌లో గల మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 16 ఏళ్లుగా అతనికి అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, తాజాగా అతని ఫోటోలు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ కావడంతో అవి తిరిగి తిరిగి అసెప్ కుటుంబ సభ్యుల కంట పడ్డాయి. అసెప్ ఫోటోను చూసి అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయాడనుకుని ఇంతకాలం కుమిలి కుమిలిపోయామని, ఇప్పుడు అసెప్ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసి తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి 16 ఏళ్ల తరువాత అసెప్ తన కుటుంబాన్ని చేరగలగడం శుభపరిణామం అని చెప్పాలి.
నవీన్ పొలిశెట్టి హీలేరియస్ హిట్టుకు సీక్వెల్ రాబోతుందా ? ఇంతకీ దర్శకుడు ఏమన్నాడంటే..