Cat Dies After Saving 2 Young Children: పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. యజమానుల ప్రాణాలకు ఏదైనా అపాయం కలిగితే వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఇది వరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను కాపాడే క్రమంలో ఓ పిల్లి చివరికి తన ప్రాణాలనే వదిలింది.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో ఇద్దరు చిన్నారులు తమ పెంపుడు పిల్లి.. ఆర్థర్‌తో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఈ సమయంలోనే ఓ విష సర్పం చిన్నారులు ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆ చిన్నారులపై దాడి చేయడానికి పాము యత్నిస్తుండగా.. గమనించిన ఆర్థర్ తన యజమానులను కాపడడానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో పిల్లి ఆ పాముతో చిన్న సైజు యుద్ధానికే దిగింది. పాముకు పిల్లికి జరిగిన ఆ పోరాటంలో చివరికి ఆర్థర్ కాటుకు గురైంది. పాము కాటు దాటికి వెంటనే కింద పడిపోయిన పిల్లి మళ్లీ ఎప్పటిలా లేచింది. ఈ క్రమంలో ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారులు కూడా పాము పిల్లిని కాటువేసిన విషయాన్ని గమనించలేదు. ఆర్థర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు. అయితే ఆర్థర్ మరుసటి రోజు ఉదయం లేవలేదు. మెల్లిగా విషమంతా పిల్లి శరీరంలో పాకడంతో చనిపోయింది. ఎంతకీ ఆర్థర్ నిద్రలేకపోవడంతో దాని యజమానులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లిని పరిశీలించిన వైద్యులు పాము కాటుకు చనిపోయిందని తేల్చి చెప్పారు. చిన్నారుల ప్రాణాలను రక్షించే క్రమంలో మరణించడంతో పిల్లి యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యజమానుల కోసం ప్రాణాలు ఆర్పించి కృతజ్ఞత చాటుకున్న ఆ పిల్లి నిజంగానే గ్రేట్ కదూ.. ఇక ఆర్థర్‌ను కాటేసిన పాము గురించి ఆస్ట్రేలియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు మాట్లాడుతూ.. గోధుమ వర్ణంలో ఉండే ఈ పాము ప్రపంచంలోనే రెండో అత్యంత విషపూరితమైందని చెప్పుకొచ్చారు. ఈ పాము విషం కాటు వేసిన వెంటనే పక్షవాతం కలిగిస్తుందని, రక్తం గడ్డకట్టకుండా ఆపుతుందని, కాటు వేసిన క్షణాల్లోనే మనిషి చనిపోతాడని తెలిపారు.
Also Read: Delta Tower : ఎయిర్ పోర్ట్ లో 84 అంతస్థుల టవర్ క్షణాల్లో నేల మట్టం.. వీడియో వైరల్