Integrated Farming: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు వ్యవసాయానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. అంతేకాక దీనికి అనుబంధంగా ఉన్న పశుపోషణ కూడా లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ రెండు కలిసి చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని కొంతమంది రైతులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ఏడాది పొడవునా సంపాదించవచ్చు. అంతేకాదు ఒకదానిలో నష్టం జరిగితే అది మరొకదానిలో భర్తీ అవుతుంది.
దీంతో రైతులు నష్టాల నుంచి సులువుగా బయటపడుతారు. అలాగే వారు వ్యవసాయం కోసం ఎవరి నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పెట్టుబడికి సరైన సమయంలో చేతిలో డబ్బులు ఉంటాయి. ఘజియాబాద్‌కు చెందిన చౌదరి కెపి సింగ్ అనే రైతు ఇలానే చేస్తున్నాడు. మొదటగా అతడు సమగ్ర వ్యవసాయం గురించి ఆలోచించి యూట్యూబ్‌లో కొంత సమాచారాన్ని సేకరించాడు. అనంతరం చేపలపెంపకం, ఆవుల పెంపకం, పౌల్ట్రీ ఫాం కలిసి ఎందుకు చేయకూడదనే ఆలోచన చేశాడు. వెంటనే అతను చేపల పెంపకంతో పాటు ఆవులు, మేకలు, కోళ్ల ఫాం కూడా ప్రారంభించాడు. ఇప్పుడు మంచి లాభాలు సంపాదిస్తున్నాడు.
ఇలా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో కేపీ సింగ్ వివరించాడు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల ఏడాది పొడవునా డబ్బు సంపాదన ఉంటుంది. ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరొక దానితో కవర్ చేయవచ్చు. మేకలు, ఆవుల పేడను చేపల పెంపకంలో ఉపయోగిస్తారు. ఇది ఖర్చును భారీగా తగ్గిస్తుంది. రైతులు ఏదైనా పంటలో లేదా పశుసంవర్ధకంలో బాగా సంపాదించవచ్చని అయితే దాని కోసం వారు సరైన పద్ధతిని ప్రయత్నించాల్సిన అవసరం ఉందని కెపి సింగ్ తెలిపాడు. కచ్చితంగా దానిపైన పూర్తి అవగాహన ఉంటే లాభాలు సంపాదించవచ్చని వివరించాడు.