ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్‌లో తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యం లభిస్తుంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని అమ్మాయి రికార్డు సృష్టించింది. ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్‌కి ఎంపికై సత్తా చాటింది. భారత టీ20 జట్టులో చోటు సంపాదించింది అంజలి శర్వాణి. ముంబై వేదికగా డిసెంబర్ 9నుంచి 20వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా ఫస్ట్‌టైమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఆదోని అమ్మాయి అంజలి. అంజలి తండ్రి స్కూలు టీచర్ కాగా, తల్లి హౌస్ వైఫ్. ఆదోనిలోని మిల్టన్ ఉన్నత పాఠశాలలోనే 10 తరగతి వరకు చదువుకుంది.
క్రికెట్‌పై మక్కువ ప్రదర్శించడంతో.. ఆమెను ఆ దిశగా ప్రొత్సహించారు పేరెంట్స్. దీంతో రాటుదేలి ఇప్పుడు నేషనల్ టీమ్‌కు ఎంపికయ్యింది. 25 ఏళ్ల అంజలి ఎడమచేతివాటం మీడియం పేస్ బౌలింగ్‌తో… బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. ఈ క్రమంలోనే సెలక్టర్ల దృష్టికి ఆకర్షించింది. భారత మహిళా క్రికెట్ టీమ్‌కి ఎంపికైన అంజలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మా ఆదోని అమ్మాయి ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఎంపికైందంటూ మురిసిపోతున్నారు పట్టణవాసులు. ఆస్ట్రేలియాపై సత్తా చాటి, దేశానికి మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెబుతుంది అంజలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..