తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిరసన తెలుపుతూ తమ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళతారు. రాజకీయ నాయకులు అయితే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో కొందరైతే నిరాహార దీక్షలు సైతం చేస్తూ తమ నిరసన తెలుపుతూ తమకు కావాల్సింది దక్కించుకుంటారు. అసలు ఇప్పుడెందుకు ఈ టాపిక్ వచ్చిందా అనుకుంటున్నారా.. ఓ మనిషి ఒక గంట కాదు ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి తన సమస్యను పరిష్కరించాలంటూ దీక్ష చేపట్టాడు. చివరికి అతని దీక్ష ఫలించి అధికారులు అతని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.
భీమవరం చెందిన ఏసు అనే వ్యక్తి తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏకంగా 100 అడుగుల ఎత్తులో గల సెల్ టవర్ పైకెక్కి నిరసన తెలియజేయడం సంచలనంగా మారింది. తన సమస్యను పరిష్కరించకపోతే అక్కడి నుంచి దూకేస్తానని సంబంధిత అధికారులు హెచ్చరించాడు. ఏకంగా 12 రోజులపాటు అదే సెల్ టవర్ పై అక్కడే ఉండిపోయాడు. ఏసు తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇవ్వటం లేదంటూ, జనవరి 18న చిన అమిరంలో గల సెల్ టవర్ ఎక్కి ఏసు నిరసన చేపట్టాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏసు తన తండ్రి పేరున వెయ్యి రూపాయలు కట్టి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాడు. అయితే బ్యాంకు అధికారులు వంద రూపాయలు మాత్రమే కట్టి రెండు లక్షలు ఇన్సూరెన్స్ చేయించారని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా బ్యాంకు సిబ్బంది తాను కట్టిన రసీదులు, రికార్డులు చూపించడం లేదని ఏసు వాపోయాడు. అయితే ఏసు గతంలో కూడా ఇన్సూరెన్స్ కట్టిన బ్యాంకు ఎదుట ధర్నా చేశాడు. అయితే అప్పట్లో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు.
అయితే తర్వాత అధికారులు తనని ఏమాత్రం పట్టించుకోవడంలేదని, తనకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం లేదంటూ మరోసారి ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలో సెల్ టవర్ ఎక్కి తన సమస్య పరిష్కరించాలని హెచ్చరించాడు. అధికారులు, పోలీసులు, బందువులు ఎంత చెప్పినా క్రిందికి దిగి రాలేదు. ప్రతిరోజు సెల్ టవర్ పై ఉన్న ఏసుకి కింద నుండి మంచినీళ్లు బంధువులు అందించారు. అలా 12 రోజులు గడిచిన తర్వాత చివరకు భీమవరం ఆర్డీవో శ్రీనివాసరాజు ఏసుతో మాట్లాడి, తన సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో 12 రోజుల దీక్ష ముగిసింది. అయితే ఏసు గత 12 రోజులుగా మంచినీళ్లు తప్ప ఇటువంటి ఆహారం తీసుకోకపోయినా అతడు పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యo వ్యక్తం చేశారు. సెల్ టవర్ పై నుంచి దిగిన అనంతరం ఏసు ను వైద్య పరీక్షలు కోసం అధికారులు హాస్పిటల్ కు తరలించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…