
వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం వల్ల చాలా మందికి దాహం అనిపించదు. దీని వల్ల నీళ్లు తాగడం కూడా తగ్గిపోతుంది. అలా చేస్తే డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ఈ వర్షాకాలంలో మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
వానాకాలంలో దాహం తక్కువగా ఉన్నా రోజూ శరీరానికి కావాల్సినంత నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అలాగే పుచ్చకాయ, దోసకాయ, టమాటా, నారింజ లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి డీహైడ్రేషన్ రాకుండా కాపాడతాయి.
చల్లగా ఉందని నీళ్లు తాగడం మానేయకండి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. బాటిల్ ను దగ్గర పెట్టుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి.
కేవలం నీళ్లు తాగడం బోర్ గా అనిపిస్తే అల్లం టీ, పుదీనా టీ లేదా నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీళ్లు తాగవచ్చు. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఈ కాలంలో టీ, కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇవి శరీరంలోని నీటిని తగ్గిస్తాయి. దాంతో డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. వాటిని తగ్గించి, నీళ్లు, ఇతర హెల్తీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోండి.
నోరు, పెదవులు పొడిబారడం, తలనొప్పి, మూత్రం రంగు మారడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఇవి డీహైడ్రేషన్ లక్షణాలు కావచ్చు.
మొత్తానికి వర్షాకాలంలో దాహం తక్కువగా ఉన్నా కూడా నీళ్లు, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి డీహైడ్రేషన్‌ను సులభంగా నివారించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)