30-30-30 Rule for Weight Loss: బరువు తగ్గడానికి ఇది నిజంగా పనిచేస్తుందా..?

వైరల్ అవుతున్న ఆరోగ్య ట్రెండ్‌ లలో 30-30-30 పద్ధతి ప్రముఖంగా మారింది. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారిని ఇది ఆకర్షిస్తోంది. అయితే ఇది నిజంగా ఉపయోగపడుతుందా..? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి..? ఈ పద్ధతి ఎలా పని చేస్తుంది..? నిజంగా ఇది సురక్షితమా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

30-30-30 Rule for Weight Loss: బరువు తగ్గడానికి ఇది నిజంగా పనిచేస్తుందా..?
Weight Loss

Updated on: Jun 30, 2025 | 5:52 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏదైనా ఆరోగ్య చిట్కాను వెంటనే ప్రయత్నించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వైరల్ అయిన 30-30-30 పద్ధతి బరువు తగ్గడంలో సహాయపడుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజంగానే మన శరీరానికి లాభమా లేక ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా అనే విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

30-30-30 విధానం మూడు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది..!

  • 30 గ్రాముల ప్రోటీన్ మిగతా ఆహారంతో పాటు తీసుకోవడం.
  • 30 నిమిషాల నడక లేదా శారీరక శ్రమ.
  • 30 నిమిషాల మితమైన వ్యాయామం.

ఉదయం ప్రోటీన్

మీరు ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల లోపల ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవాలి. ఇది జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్పాహారంలో గుడ్లు, పాలు, మొలకలు లేదా మాంసాహారం వంటివి ప్రోటీన్ మూలాలుగా ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం అవసరం

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల మితమైన శారీరక శ్రమ చేయడం వల్ల శరీరానికి తగినంత శ్రమ లభిస్తుంది. ఇది అధిక బరువు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. నడక, సైక్లింగ్ లేదా యోగా వంటి తేలికైన మార్గాల ద్వారా కూడా దీన్ని సులభంగా పాటించవచ్చు.

ఈ 30-30-30 పద్ధతిలో తీసుకునే మొత్తం ఆహారంలో 30 శాతం ప్రోటీన్, 30 శాతం కొవ్వులు, 30 శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్త పడాలి.

  • ప్రోటీన్.. ఇది కండరాల అభివృద్ధికి, కడుపు నిండిన భావన కలిగించడానికి, ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
  • మంచి కొవ్వులు (వేరుశెనగ నూనె, గింజలు, అవకాడో) హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టడంలో ముఖ్యమైనవి.
  • కార్బోహైడ్రేట్లు.. శక్తిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శరీరానికి మేలు చేసే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు బియ్యం కాకుండా గోధుమ, జొన్న, కూరగాయలు లాంటివి.

ఈ పద్ధతిలో విజయం సాధించాలంటే.. మీరు తినే ఆహారం మంచి నాణ్యతతో ఉండాలి. కేవలం ఎంత తింటున్నాం అన్నది కాకుండా.. ఆ ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయి అన్నది ముఖ్యం. అంతేకాదు ఈ పద్ధతి ప్రతి ఒక్కరికీ సరిపోదు. అది మీ జీవనశైలి, వయసు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే అనుభవం ఉన్న డైటీషియన్ సలహా తీసుకుని ఈ ప్లాన్‌ ను మొదలుపెట్టడం చాలా మంచిది.

30-30-30 పద్ధతిని సరైన ఆహార ఎంపికలు, క్రమబద్ధమైన శారీరక శ్రమతో కలిపి అనుసరించినట్లయితే.. ఇది బరువు తగ్గడంలో సహాయపడే అవకాశం ఉంది. కానీ దీన్ని కేవలం వైరల్ ఫార్ములాగా కాకుండా ఆలోచనాత్మకంగా మీ వ్యక్తిగత అవసరాలను బట్టి అనుసరించడం వల్లే దీర్ఘకాలిక ఫలితాలను పొందగలుగుతారు.